BF.7 variant India : ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం.. తక్కువే!-bf 7 variant of covid 19 may not be serious in india says expert ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bf.7 Variant India : ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం.. తక్కువే!

BF.7 variant India : ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం.. తక్కువే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 25, 2022 02:02 PM IST

BF.7 variant India : ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిస్తున్నారు.

ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం.. తక్కువే!
ఇండియాపై కొవిడ్​ కొత్త వేరియంట్​ ప్రభావం.. తక్కువే!

BF.7 variant India : చైనాలో పుట్టుకొచ్చిన కొవిడ్​ కొత్త వేరియంట్​ బీఎఫ్​.7పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా పొరుగు దేశమైన ఇండియాలో ప్రజలు భయపడిపోతున్నారు. చైనాలో వెలుగులోకి వస్తున్న కొవిడ్​ కేసులను చూసి వణికిపోతున్నారు. జీవితం మళ్లీ కొవిడ్​ సంక్షోభంలోకి వెళిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. భారతీయులకు ఊరటని కలిగించే వార్త ఒకటి బయటకొచ్చింది. చైనాతో పోల్చుకుంటే.. కొవిడ్​ కొత్త వేరియంట్​ బీఎఫ్​.7 ప్రభావం ఇండియాలో తక్కువగానే ఉంటుందని సీసీఎంబీ(సెల్యూలర్​ అండ్​ మాలిక్యులర్​ బయోలాజీ) డైరక్టర్​ వినయ్​ కే నందికూరి తెలిపారు. భారతీయుల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే ఈ ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు.

బీఎఫ్​.7 ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించాలి అని పిలుపునిచ్చారు వినయ్​ కే నందికూరి. ఒమిక్రాన్​ వేరియంట్లకు రోగనిరోధక శక్తిని బలహీనపరిచే శక్తి ఉంటుందని హెచ్చరించారు.

Omicron BF.7 variant : "డెల్టాతో పోల్చుకుంటే బీఎఫ్​.7 వేరియంట్​ తీవ్రత తక్కువగానే ఉంది. హెర్డ్​ ఇమ్యూనిటీ పొందడమే ఇందుకు కారణం. మనపై ఇతర వైరస్​ల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టే మనకి హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల బీఎఫ్​.7తో భయపడాల్సిన పని లేదు. డెల్టాతో భయపడ్డాము. ఆ తర్వాత టీకాలు వచ్చాయి. ఆ తర్వాత ఒమిక్రాన్​ వచ్చింది. దానిపై పోరాటంగా బూస్టర్​ డోస్​లు వచ్చాయి. చైనాతో పోల్చుకుంటే మనం చాలా డిఫరెంట్​. చైనాలో ఇప్పుడు జరుగుతున్నది ఇండియాలో జరగకపోవచ్చు," అని సీసీఎంబీ డైరక్టర్​ వినయ్​ కే నందికూరి తెలిపారు.

"చైనాలో పాటించే జీరో కొవిడ్​ నిబంధనే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది. అక్కడ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువే. అందుకే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇండియాలో కొవిడ్​ రెండు డోసులతో పాటు బూస్టర్​ డోస్​లు కూడా తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఇండియా సేఫ్​ జోన్​లో ఉందనే చెప్పాలి," అని వినయ్​ స్పష్టం చేశారు.

నాలుగు కేసులు..!

India BF.7 variant news : మీడియా నివేదికల ప్రకారం.. బీఎఫ్​.7 ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​కు సంబంధించి.. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం 227 కేసులు వెలుగులోకి వచ్చాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 3,424కు చేరింది. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.46కోట్లు దాటింది. దేశంలో కొవిడ్​ కారణంగా 5,30,693మంది ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో ఇద్దరు మరణించారు.

మరోవైపు ఈ ఏడాది చివరి మన్​-కీ-బాత్​లో భాగంగా ప్రజలు కొవిడ్​పై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం