2024 సంక్రాంతి నాటికి అయోధ్య రామాలయం సిద్ధం
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం 2024 జనవరి నాటికి పూర్తవుతుందని వీహెచ్‌పీ నేత ఒకరు తెలిపారు. గర్భ గుడి శంకుస్థాపన ఈ జూన్ 1న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా జరగనుంది.
దశాబ్దాల వివాదం అనంతరం, అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. `గర్భగుడి నిర్మాణ కార్యక్రమాలు జూన్ 1న ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ జూన్ 1న అయోధ్య రానున్నారు. ఆయన చేతుల మీదుగా గర్భాలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత, 2024 మకర సంక్రాంతి నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుంది` అని వీహెచ్‌పీ నేత శరద్ శర్మ వెల్లడించారు.
పూర్తిగా ఎర్రరాతి కట్టడం
గర్భగుడి నిర్మాణం పూర్తిగా ఎర్రరాతి(రెడ్ స్టోన్)తో జరుగుతుందని శరద్ శర్మ వెల్లడించారు. దాంతో, గర్భగుడి నిర్మాణం అద్భుతంగా ఉండబోతోందని వివరించారు. 2024 మకర సంక్రాంతి నుంచి బాల రాముడు అయోధ్య గర్భగుడిలో నుంచే భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. గర్భగుడి శంకుస్థాపన కార్యక్రమంలో వాడే తొలి రాయి 1990లో కరసేవ సమయంలో రూపుదిద్దుకున్నది కావడం విశేషం. 2020 ఆగస్ట్ 5న రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సూర్యుడి తొలి కిరణాలు
సూర్యుడి తొలి కిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఆలయ నిర్మాణం జరుగుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాసు వెల్లడించారు. రెడ్ స్టోన్ అత్యంత పవిత్రమైనదని, ఆ రాయితో నిర్మితమైన ఆలయం చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 1న గర్భాలయ శంకుస్థాపనలో పాల్గొంటారని, ఆ తరువాత 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయని వెల్లడించారు.
2024లోనే ఎన్నికలు
లోక్‌సభకు ఎన్నికలు 2024లోనే జరగనుండడం గమనార్హం. ఆ ఎన్నికల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే, 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని బీజేపీ పొందుపర్చింది.
టాపిక్