Raging: సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి.. స్పందించిన సీఎం
Assam Dibrugarh University Ragging Case: దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. ర్యాగింగ్ తట్టుకోలేక ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి దూకాడు. ఈ విషయంపై అసోం సీఎం కూడా స్పందించారు.
Assam Dibrugarh University Ragging Case: అసోంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక తప్పించుకునేందుకు ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ర్యాగింగ్‍కు పాల్పడిన ఐదుగురు సీనియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పూర్తి వివరాలివే..
విద్యార్థికి తీవ్ర గాయాలు
Assam Dibrugarh University Ragging Case: దిబ్రూగఢ్ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్ మెంట్‍లో ఆనంద్ శర్మ.. తొలి సంవత్సరం చదువుతున్నాడు. అయితే సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేయడటంతో హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి అతడు దూకేశాడని తెలుస్తోంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆనంద్‍కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‍కు పాల్పడిన ఐదుగురిని దిబ్రూఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ లో స్పందించారు. “ర్యాగింగ్ ఘటనలో దిబ్రూగఢ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి గాయపడిన సంగతి మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాం. జిల్లా అధికారులు సమన్వయం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టాలి. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. బాధితుడికి వైద్య సేవలు అందుతున్నాయి. విద్యార్థులు.. ర్యాగింగ్‍కు పాల్పడవద్దండి (స్టూడెంట్స్, సే నో టూ ర్యాగింగ్)” అని హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
ఫిర్యాదులో ఆశ్చర్యపరిచే విషయాలు
Assam Dibrugarh University Ragging Case: తన కుమారుడిని యూనివర్సిటీలో సీనియర్లు దారుణంగా ర్యాగింగ్ చేశారని ఆనంద్ శర్మ తల్లి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో ఆమె చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారని సమాచారం. ర్యాగింగ్ వల్ల కుమారుడు శారీరకంగా, మానసికంగా చాలా వేదన చెందాడని, అతడి దగ్గర ఉండే డబ్బును, మొబైల్ ఫోన్‍ను కూడా సీనియర్లు లాక్కునే వారని పేర్కొన్నారు. ఆల్కహాల్ తాగాలని కూడా తన కుమారుడిని బలవంతం చేశారని, అభ్యంతరకరంగా ఫొటోలు కూడా తీశారని ఆరోపించారు. భవిష్యత్తులో ర్యాగింగ్ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చూపించి బెదిరించేందుకు ఈ ఫొటోలను దాచుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.
ర్యాగింగ్ కేసులో అరెస్టయిన ఐదుగురిలో ఓ మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. మరో నలుగురు ప్రస్తుత విద్యార్థులు. ర్యాగింగ్ గురించి ఆనంద్ శర్మ ఇది వరకే హాస్టల్ వార్డెన్‍కు ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. పేర్లతో సహా ఈనెల 17న కంప్లయింట్ చేశాడని సమాచారం. ఈ విషయంపై మరింత విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు.