Amritpal Singh: రెండు కార్లు, బైక్.. ఆ తర్వాత ట్రాలీ మోటార్‌సైకిల్: అమృత్‍పాల్ మరో ఫొటో.. వేట సాగిస్తున్న పోలీసులు
Amritpal Singh: అమృత్‍పాల్ సింగ్‍కు సంబంధించి మరో ఫొటో బయటికి వచ్చింది. ఓ ట్రాలీ మోటార్ సైకిల్‍పై ఆయన వెళుతున్నట్టు అందులో ఉంది. అమృత్‍పాల్‍ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Amritpal Singh: ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్‍పాల్ సింగ్‍ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు (Punjab Police) వేట కొనసాగిస్తూనే ఉన్నారు. గత శనివారం పోలీసులు భారీ చేజ్ చేయగా.. అమృత్‍పాల్ తప్పించుకున్నారు. ఆ తర్వాతి నుంచి పోలీసులు తీవ్రంగా సోదాలు చేస్తున్నారు. అయితే అమృత్‍పాల్ వేషాలు మారుస్తూ.. వాహనాలు మారుస్తూ తిరుగుతున్నారు. ఇందుకు సంబంధించి క్రమంగా వీడియోలు, ఫొటోలు బయటికి వస్తున్నాయి. తాజాగా అమృత్‍పాల్‍కు చెందిన మరో ఫొటో వెల్లడైంది. తన బైక్‍తో ఓ ట్రాలీ మోటార్‌సైకిల్‍పై అమృత్‍పాల్ వెళుతున్నట్టు అందులో ఉంది. పెట్రోల్ అయిపోయి తన బైక్ ఆగిందా లేక సాంకేతిక సమస్యనా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఈ బైక్‍ను పోలీసులు బుధవారం గురుద్వారా వద్ద పట్టుకున్నారు. అయితే ప్రస్తుతం అమృత్‍పాల్ ఎక్కడున్నారో మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. మరోవైపు అమృత్‍పాల్ భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నించారు. వివరాలివే.
వాహనాలు మారుతూ..
Amritpal Singh: శనివారం వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో కార్లతో చేజ్ చేసినా పట్టుబడకుండా అమృత్‍పాల్ తప్పించుకున్నారు. తరచూ వాహనాలు మారుస్తూ పోలీసుల కళ్లు గప్పారు. ముందుగా మెర్సెడెజ్ కారులో పోలీసులకు దొరకకుండా వెళ్లారు అమృత్‍పాల్. ఆ తర్వాత కాసేపటికే బ్రెజా ఎస్‍యూవీకి మారారు. అదే రోజు బ్రెజా నుంచి బైక్‍కు వచ్చారు. దుస్తులు మార్చుకొని బైక్‍పై ప్రయాణించారు. ఆ తర్వాత ట్రాలీ ఉన్న మోటార్ సైకిల్‍లో తన బైక్‍తో పాటు వెళ్లారు. తప్పించుకున్న సమయంలో అమృత్‍పాల్ వెంట ముగ్గురు ఉండగా.. ట్రాలీలో వెళుతున్న ఫొటోలో మాత్రం ఆయనతో పాటు ఒకరే కనిపించారు. పింక్ కలర్ టర్బన్, గాగుల్స్ పెట్టుకొని ఎవరూ గుర్తు పట్టకుండా ఈ ఫొటోలో ఉన్నారు అమృత్‍పాల్. అమృత్‍పాల్ కారులో పరారైన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 7 వేషాల్లో ఉన్న అమృత్‍పాల్ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
Amritpal Singh: అమృత్‍పాల్ ప్రయాణించిన బైక్‍ను బుధవారం రోజున పంజాబ్ పోలీసులు ఓ గురుద్వారా వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అమృత్‍పాల్ అనుచరులను 100 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్లపై అమృత్‍పాల్‍పై కేసులను నమోదు చేశారు.
అమృత్‍పాల్ భార్య, తల్లి విచారణ
Amritpal Singh: అమృత్‍పాల్ సొంత గ్రామం జల్లుపూర్ ఖేరాకు బుధవారం వెళ్లారు పోలీసులు. అక్కడ అమృత్‍పాల్ తల్లి బల్వీందర్ కౌర్, భార్య కిరణ్‍దీప్ కౌర్ సహా మరికొందరిని ప్రశ్నించారు. అమృత్‍పాల్ ఎక్కడున్నారో తెలిస్తే చెప్పాలని అడిగారు. ఎన్ఆర్ఐ అయిన కిరణ్‍దీప్‍ను ఫిబ్రవరిలోనే బ్రిటన్‍లో పెళ్లి చేసుకున్నారు అమృత్‍పాల్. ఆ తర్వాత ఆమె కూడా పంజాబ్‍లోనే ఉంటున్నారు. వారిస్ దే పంజాబ్‍కు విదేశీ నిధులను కిరణ్‍దీప్ సమకూర్చారని రిపోర్టులు కూడా బయటికి వచ్చాయి.
మరోవైపు అమృత్‍పాల్‍కు ఉగ్రవాద లింకులపైనా పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేకమైన ఆర్మీని ఆయన ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువేదం పేరుతో యువతను అమృత్‍పాల్ రెచ్చగొడుతున్నారని, తప్పుడుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్