Amarnath Yatra: నేటి నుంచి తిరిగి కొనసాగనున్న అమర్‌నాథ్ యాత్ర
Amarnath Yatra: పవిత్ర అమర్‌నాథ్ గుహ సమీపంలో మేఘాల విస్ఫోటనంతో ఆకస్మిక వరదల కారణంగా నిలిచిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది.
అమర్‌నాథ్ యాత్రికుల తాజా బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంప్ నుండి తమ యాత్రను ప్రారంభించారు. ‘మేం శివుడి దర్శనం లేకుండా తిరిగి వెళ్ళలేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది. బాబా దర్శనం కోసం వేచి ఉన్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాం. సీఆర్‌పీఎఫ్, ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. క్షేమంగా ముందుకు సాగాలి’ అని యాత్రికులు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
మేఘాల విస్ఫోటనం, వరదల సంఘటన తర్వాత పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం నున్వాన్ పహల్గామ్ వైపు నుంచి తిరిగి ప్రారంభమవుతుందని అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు ఆదివారం తెలిపింది. యాత్ర తిరిగి ప్రారంభించడానికి యాత్రికులు బాల్టాల్ బేస్ క్యాంపు వద్ద వేచి ఉన్నారు.
శుక్రవారం అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రం సమీపంలో వరదలు సంభవించిన కారణంగా 16 మంది మరణించారు. కనీసం మూడు డజన్ల మంది తప్పిపోయారు.
బల్తాల్, నున్వాన్ రెండు వైపుల నుండి చాపర్లు అందుబాటులో ఉంటాయి.
ఈరోజు ఐఏఎఫ్ ఎంఐ-17 వీ5, చీతల్ హెలికాప్టర్ల ద్వారా గాయపడిన మరో 34 మంది యాత్రికులను తరలించారు. ఐఏఎఫ్ హెలికాప్టర్లు శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతకడానికి ఆరు జాగిలాలతో పాటు 20 మంది ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా విమానంలో పంపించాయి.
శుక్రవారం పవిత్రమైన అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో మేఘాల విస్ఫోటనం సంభవించిన తరువాత ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి భారత సైన్యం ఆదివారం రాడార్‌లను ప్రవేశపెట్టింది.
‘జావర్ 4000 రాడార్ ద్వారా శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడం కోసం మధ్యాహ్నం నుండి ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిచేస్తున్నాం..’ అని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు.
అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) మనోజ్ సిన్హా ఆదివారం పహల్గామ్‌లోని బేస్ క్యాంపును సందర్శించి యాత్రికులను కలిశారు.
‘భద్రతా సిబ్బంది, యంత్రాంగం సమర్ధవంతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మార్గాన్ని బాగు చేయడంతో పాటు యాత్రను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాత్రికులు రావాలి. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..’ సిన్హా హామీ ఇచ్చారు.
35 మంది యాత్రికులు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఏఎస్‌బీ) అధికారులు శనివారం తెలిపారు.
‘35 మంది యాత్రికులు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రాత్రికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారు’ అని ఎస్ఏఎస్‌బీ అధికారులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో శ్రీనగర్‌కు తరలించారు. ‘తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో శ్రీనగర్‌కు తరలించారు. మేం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ పోలీసుల గణాంకాల ప్రకారం 41 మంది తప్పిపోయారు. వారిలో కొందరిని రక్షించారు..’ అని సీఆర్‌పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ అన్నారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) శనివారం అందించిన డేటా ప్రకారం.. పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ సమీపంలో మేఘాల విస్ఫోటనం ఘటనలో కనీసం 16 మంది మరణించారు.
కాగా శనివారం అమర్‌నాథ్ పుణ్యక్షేత్రంలో రక్షణ, సహాయక చర్యల కోసం భారత వైమానిక దళానికి చెందిన నాలుగు ఎంఐ-17వి5, నాలుగు చీతల్ హెలికాప్టర్‌లను మోహరించారు.
ఐదుగురు ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, 3.5 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌తో చీతల్ హెలికాప్టర్లు 45 సార్లు ప్రయాణించాయి.