`Criminal` ministers | ఆ మంత్రుల్లో 72% మందిపై క్రిమినల్ కేసులు
`Criminal` ministers | బిహార్‌లో కొత్తగా కొలువుతీరిన మహా కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో మెజారిటీ మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. నితీశ్ తాజా టీమ్‌లోని 72% మందిపై క్రిమినల్ కేసులున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
`Criminal` ministers | బిహార్‌లో ఎన్‌డీఏ నుంచి వైదొలగి, పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ నేత నితీశ్‌కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన తరహాలో జేడీయూని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్న కారణంతో నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.
`Criminal` ministers | 72% మంత్రులపై క్రిమినల్ కేసులు
అయతే, నితీశ్ కొత్త మంత్రివర్గంలో దాదాపు ముప్పాతిక శాతం మంత్రులకు నేర చరిత్ర ఉన్నట్లు తాజాగా తేలింది. ఏకంగా న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్ పైననే క్రిమినల్ కేసు ఉండడం సంచలనంగా మారింది. కొత్త మంత్రులపై క్రిమినల్ కేసుల విషయాన్ని ఎన్నికల హక్కుల కోసం పనిచేసే సంస్థ Association for Democratic Reforms (ADR) వెల్లడించింది. ఏడీఆర్ ఆగస్ట్ 16న వెల్లడించిన వివరాల ప్రకారం.. నితీశ్ తాజా కేబినెట్‌లోని 33 మంది మంత్రుల్లో 27 మంది(72%) పై క్రిమినల్ కేసులున్నాయి. అందులో 17 మందిపై(53%) హత్య, రేప్, కిడ్నాప్ వంటి సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాన్ని వారే తమ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. క్రిమినల్ కేసులున్న మంత్రుల్లో ఆర్జేడీకి చెందినవారు 15 మంది కాగా, వారిలో 11 మందిపై సీరియస్ కేసులున్నాయి. నితీశ్ కేబినెట్లో ఆర్జేడీకి చెందిన మంత్రుల సంఖ్య 17. అంటే, ఇద్దరు మినహా ఆర్జేడీ మంత్రులందరిపై క్రిమినల్ కేసులున్నాయి. జేడీయూ కి చెందిన 11 మంది మంత్రుల్లో నలుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులపై కూడా క్రిమినల్ కేసులున్నాయి.
`Criminal` ministers | న్యాయ మంత్రిపైనే కేసు
నితీశ్ తాజా కేబినెట్‌లోని న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్ పై కిడ్నాప్ కేసు ఉంది. ఆగస్ట్ 16న ఈ కేసులో ఆయన కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంది. అయితే, అదే రోజు ఆయన రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ సహచరుడిపై కేసు ఉన్న విషయం తనకు తెలియదని సీఎం నితీశ్ వ్యాఖ్యానించారు.