5G subscriptions : 5 జీ కనెక్షన్లు 2027 నాటికి 50 కోట్లు
5జీ కనెక్షన్లు 2027 నాటికి 50 కోట్లు దాటుతాయని ఓ నివేదిక అంచనా వేసింది.
న్యూఢిల్లీ, జూన్ 21: 5జీ సబ్‌స్క్రిప్షన్లు ఇండియాలో 2027 చివరి నాటికి 50 కోట్లకు చేరుకుంటాయని, ప్రస్తుత మొబైల్ సబ్‌స్క్రైబర్లలో ఈ సంఖ్య 39 శాతంగా ఉంటుందని స్వీడిష్ టెలికామ్ గేర్ మేకర్ ఎరిక్సన్ తన మొబిలిటీ రిపోర్ట్‌లో తెలిపింది.
ఇండియాలో 5జీ నెట్ వర్క్స్ కమర్షియల్ కార్యకలాపాలు ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి.
‘2021, 2027 మధ్య మొబైల్ డేటా ట్రాఫిక్ ఇండియా రీజియన్‌లో 4 రెట్లు పెరుగుతుందని అంచనా. స్మార్ట్‌ఫోన్ యూజర్లలో భారీ పెరుగుదల, స్మార్ట్ ఫోన్ యావరేజ్ యూసేజ్‌లో పెరుగుదల ఇందుకు దోహదం చేస్తుంది..’ అని ఎరిక్సన్ ఇండియా ప్రతినిధి థియా సెంగ్ తెలిపారు.
ఒక్కో స్మార్ట్ ఫోన్ యావరేజ్ డేటా ట్రాఫిక్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న రెండో అతిపెద్ద దేశం ఇండియా అని రిపోర్ట్ తెలిపింది.
కాగా యావరేజ్ డేటా నెలకు 20 జీబీ నుంచి 2027 నాటికి 50 జీబీకి చేరుకుంటుందని, వార్షిక వృద్ధిరేటు 16 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
2027లో ఇండియాలో మొత్తం సబ్‌స్క్రిప్షన్లలో 40 శాతం వరకూ 5జీ కనెక్షన్స్ ఉంటాయని, అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.4 బిలియన్ కనెక్షన్లలో సగానికి సగం 5జీ కనెక్షన్స్ ఉంటాయని నివేదిక అంచనా వేసింది.
రానున్న ఐదేళ్లలో నార్త్ అమెరికా 5జీ కనెక్షన్లతో నిండిపోతుందని, ప్రతి పది మందిలో 9 మందికి 5జీ సబ్‌స్క్రిప్షన్ ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ఎరిక్సన్ ప్రాయోజిత ఓమ్డియా కన్సల్టెన్సీ వెల్లడించిన ఓ నూతన అధ్యయనం ప్రకారం దేశంలో 52 శాతం వాణిజ్య సంస్థలు తదుపరి 12 నెలల్లో 5జీ సేవలు వినియోగించాలనుకుంటున్నాయి. 2024 నాటికల్లా మరో 31 శాతం సంస్థలు 5జీ సేవలు వినియోగించాలనుకుంటున్నాయి.
ప్రస్తుతం 2022 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 5జీ మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్ 1 బిలియన్‌కు చేరుకుంటాయని నివేదిక అంచనావేసింది.
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన మొబైల్ టెక్నాలజీ వెర్షన్లు అన్నింటిలోకెల్లా 5జీ అత్యంత వేగవంతంగా పనిచేస్తుందని నివేదిక స్పష్టం చేసింది. 2027 నాటికి నాలుగింట మూడువంతుల ప్రపంచ జనాభాకు 5జీ యాక్సెస్ లభిస్తుందని తెలిపింది.
‘ప్రస్తుతం ఇండియాలో మొబైల్ యూజర్లలో 4జీ కనెక్షన్లు 68 శాతం ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య 55 శాతానికి పడిపోతుంది. ఏటా 7 కోట్ల మంది 4జీ నుంచి 5 జీకి మైగ్రేట్ అవుతారు..’ అని నివేదిక అంచనా వేసింది.
టాపిక్