DA hike : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3శాతం డీఏ పెంపు!
DA hike : ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్రం గుడ్ న్యూస్ ఇచ్చింది. 3శాతం డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది.
DA hike : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 7వ పే కమిషన్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను 3శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. 2022 జనవరి 1 నుంచి ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
అరావల్లి జిల్లాలో.. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు గుజరాత్ సీఎం. జెండా వందనం అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. ప్రజలు.. దేశ ప్రయోజనాలకు తమ జీవితంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు వార్తను అందించారు.
గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం కింద 9.38లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా డీఏ పెంపుతో పంచాయత్ సేవలు, పింఛనుదారులు సైతం లబ్ధిపొందనున్నారు. కాగా.. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై వార్షికంగా రూ. 1,400 కోట్ల భారం పడనుందని సీఎం వివరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరిచారు గుజరాత్ సీఎం. రానున్న రోజుల్లో ప్రవేశపెట్టే పథకాలను సైతం ప్రస్తావించారు. ద్వారక, అంబాజీ, ఐక్యతా విగ్రహం వద్ద ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. బీఎస్-జీకి చెందినన 1,200 కొత్త బస్సులను సైతం తీసుకొస్తామని వెల్లడించారు. దీని వ్యయం రూ. 367కోట్లు అని అన్నారు. ప్రజల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్