WednesDay Motivation: ఎదగాలంటే నక్షత్రాలను చూడండి... నేలమీదున్న ఇసుకను కాదు
WednesDay Motivation: కిందకి చూస్తున్నంతసేపు తల, చూపు కిందవైపుకే ఉంటాయి. ఎదగాలంటే మీ చూపు ఆకాశంపైకి ఉండాలి.
WednesDay Motivation: ఉన్న స్థానం నుంచి పైకి ఎదగాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మీరు కిందకి చూస్తున్నంత కాలం మీ చూపు, తల కిందకే ఉంటాయి. ఎదగాలంటే మీ చూపు ఆకాశాన్ని చూడాలి, నక్షత్రాలను చూడాలి. నేల మీదున్న ఇసుక రేణువులను చూసుకుంటున్నంత కాలం మీరు, మీ చూపు కిందనే ఉంటాయి.
మీరు ఎదగాలంటే... ముందుగా కల కనాలి. ఆ కలను నెరవేర్చుకోవడం కోసం తపన పడాలి. కలామ్ ఎప్పుడో చెప్పారు... పెద్ద కలలు కంటేనే, పెద్దగా ఎదుగుతారని. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలను ఫాలో అవ్వాలి. మీ కల ఎంత పెద్దగా ఉంటే... మీరు సాధించే విజయం కూడా అంతే పెద్దగా ఉంటుంది. కల కనడానికి భయపడే వారు జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం.
మీ కలే మీ విజయానికి మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కినప్పుడే మీరు భయపడ్డారంటే అక్కడే ఆగిపోతారు. కలే మిమ్మల్ని అంతగా భయపెడితే... దాన్ని నిజం చేసే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు మిమల్ని అగాధానికి తోసేస్తాయి. ఎప్పుడైనా మొదటి అడుగు ఆత్మవిశ్వాసంతోనే వేయాలి. వైఫల్యం ఎదురైనా తట్టుకునే గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాలి. వైఫల్యమే విజయానికి మొదటి సోపానం అనే విషయాన్ని మర్చిపోకూడదు.
మీరు త్వరగా విజయం సాధించాలంటే దగ్గర దారి ఒకటుంది. అది అందరూ వెళ్లే దారిని వదిలి... మీ దారిని మీరు ఎంచుకోండి. ఆ దారిలో మీరు ఒంటరి కావచ్చు. కానీ విజయం మీకు ఎదురైవస్తుంది. ఒంటరి దారిలో ఎదురయ్యే అడ్డంకులకు భయపడితే విజయాన్ని చేరుకోవడం కష్టం. మీ దారి ఎంత కష్టంగా ఉంటే విజయం అంత పెద్దగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
కలలు కనడమే, దాన్ని సాధించడానికి కావాల్సిన ప్రణాళిక, వెళ్లాల్సిన దారి, కలుపుకోవాల్సిన స్నేహాలు... అన్నింటినీ ముందుగా నిర్ణయించుకోవాలి. డబ్బు సంపాదించడమే విజయం అనుకోవద్దు. నలుగురికి మార్గదర్శిలా నిలవడం కూడా విజయమే. అబ్దుల్ కలామ్ మన దేశానికి ప్రతీకలా మారారు. ఆయన సంపాదించింది ఆస్తి కాదు, గొప్ప పేరు.
మీకు నీరసాన్ని, ఆందోళనను కలిగించేది, మీలో ఆశను చంపేసే వస్తువులు, వ్యక్తులను దూరంగా ఉంచండి. విజయం సాధించే వరకు స్పూర్తిదాయకపమైన కథనాలను, పుస్తకాలను దగ్గర పెట్టుకోండి. ప్రేరణ చాలా ముఖ్యం. ఆ ప్రేరణ సానుకూల ప్రభావాన్ని చూపించేదిగా ఉండాలి. విజయం సాధించాలంటే నెగిటివ్ ఫీలింగ్స్‌కు దూరంగా ఉండాలి.