King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట-the scientists solved the mystery said that the pharaoh curse was not the cause of the deaths in tut tomb ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

Haritha Chappa HT Telugu
May 01, 2024 10:47 AM IST

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

కింగ్ టూటన్‌కామూన్ సమాధి
కింగ్ టూటన్‌కామూన్ సమాధి

King Tut: ఈజిప్టు పేరు చెబితేనే పిరమిడ్లు గుర్తుకొస్తాయి. ఆ పిరమిడ్లలో ఎన్నో సమాధులు దాగి ఉన్నాయి. ఈ పిరమిడ్ల నిర్మాణానికి కనీసం వెయ్యి సంవత్సరాల సమయం పట్టి ఉండవచ్చని చరిత్ర చెబుతోంది.

సుమారు వందేళ్ల క్రితం కింగ్ టూటన్‌కామూన్ కు చెందిన ప్రాచీన సమాధిని కనిపెట్టారు. అతడిని యువ ఫారో గా పిలుచుకుంటారు. ఈజిప్టులో రాజులను ఫారో అని పిలుస్తారు. ఇతడిని కింగ్ టట్ అని కూడా అంటారు. ఇతను కేవలం 18 ఏళ్ళ వయసులోనే మరణించారు. అతను మలేరియా, కాలు ఫ్రాక్చర్ కారణంగా మరణించి ఉంటాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇతని సమాధిని 1922లో కనిపెట్టారు. ఈ సమాధిని కనిపెట్టిన వ్యక్తి హోవార్డు కార్టర్. అతనితోపాటు అతని బృందం కూడా ఎన్నో ఏళ్ల పాటు కష్టపడింది. అయితే ఈ సమాధి తవ్వినప్పుడు అందులో భాగమైన 20 కంటే ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఈ ఫారో సమాధిని తవ్వడంవల్లే శాపం తగిలిందని, అందుకే వారు మరణించారని పుకారు మొదలైంది. దాన్ని ఫారోలా శాపంగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్ల పాటు ఆ సమాధిలోకి వెళ్ళిన కొంతమంది ఎందుకు మరణించారో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

వందేళ్ల తర్వాత ఇప్పుడు కింగ్ టుటెన్ కామూన్ సమాధిలోకి వెళ్లిన మనుషుల్లో అంతమంది మరణించడానికి కారణాన్ని కనిపెట్టారు. అది ఫారో శాపం కాదని అక్కడున్న అధిక స్థాయి రేడియేషన్ అని గుర్తించారు. అక్కడ ఎలాంటి అతీంద్రియ శక్తులు, శాపాలు లేవని చెప్పారు.

రేడియేషన్ వల్లే మరణాలు

తీవ్రమైన రేడియేషన్‌కు గురైన వారంతా అనేక రకాల క్యాన్సర్‌ల బారిన పడి పూర్తిస్థాయి జీవిత కాలాన్ని పొందలేకపోయారని, అకాలంగా మరణించారని శాస్త్రవేత్తలు గుర్తించారు. గిజా పిరమిడ్ సమీపంలోని ఇతర ప్రదేశాలలో కూడా భూగర్భ సమాధుల వద్ద అనేక తీవ్రమైన రేడియో ధార్మికతను గుర్తించారు. పురాతన ఈజిప్షియన్లు కూడా తమకు తెలియకుండానే ఈ రేడియేషన్‌కు గురై అనేక రకాల క్యాన్సర్ల బారిన పడి ఉంటారని అంచనా వేస్తున్నారు.

కింగ్ టట్ సమాధి 3000 ఏళ్ల పాటు మూసి ఉంది. ఆ మూసి ఉన్న సమాధిలో యురేనియం తన శక్తిని అలా నిలుపుకుంటూ వచ్చింది. అయితే ఆ ప్రాంతంలో రేడియో ధార్మికత మాత్రం విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే ఆ సమాధిని తెరిచారో వారంతా ఒకేసారి అధిక రేడియేషన్ కు గురయ్యారు. వారు అతి తక్కువ కాలంలోనే క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఆ సమాధి తెరిచిన కొద్దిసేపటికి ఆ సమాధిని కనిపెట్టడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి కూడా మరణించారు. దీంతో ఆ రాజు శాపం తగిలిందంటూ ప్రచారం జరిగింది. అతని మరణం తర్వాత సమాధిలోకి ప్రవేశించిన మరి కొంతమంది కూడా మరణించారు. దీంతో ఆ రాజు శాశ్వతమైన నిద్రకు భంగం కలిగిందని, అందుకే వారికి మరణం సంభవించిందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధమని.. కేవలం రేడియేషన్ వల్లే అందరూ మరణించినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Whats_app_banner