Sai Pallavi: సాయి పల్లవి వివాదాస్పద కామెంట్లపై విజయశాంతి సీరియస్
తమిళనాడులో పుట్టినా.. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె యాక్టింగ్‌కు ఫిదా అయిపోయి తమ మనసుల్లో చోటిచ్చారు. కానీ ఇప్పుడదే నటి ఏమాత్రం అవగాహన లేకుండా చేసిన కామెంట్లతో అదే అభిమానులు సాయిపల్లవిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
సాయి పల్లవి.. టాలెంట్ ఉన్న నటి. నటనలో, డ్యాన్స్‌లో ఇరగదీస్తుందన్న పేరుంది. తాజాగా వచ్చిన విరాట పర్వం మూవీలోనూ ఆమె నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. అయితే ఇదే మూవీ ప్రమోషన్‌లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కశ్మీరీ పండిట్ల ఊచకోతను, గోరక్షకులు పాల్పడిన హింసను ఒకేగాటన కడుతూ ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
పైగా భారత ఆర్మీ జవాన్లు.. పాకిస్థాన్ వాళ్లకు ఉగ్రవాదులుగా కనిపిస్తారంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆగ్రహానికి గురి చేశాయి. ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ అభిమానించిన వాళ్లే ఆమె అవగాహన లేని ఈ మాటలను ఎండగడుతున్నారు. తాజాగా నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా ట్విటర్ ద్వారా సాయిపల్లవి కామెంట్స్‌పై సీరియస్ అయింది.
విరాట పర్వం సినిమా ఆర్థిక లాభాలపై ఆసక్తి ఉన్న వాళ్లు ఆమెతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించి తన మూవీ వైపు ప్రజలు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయంటూ ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. "కశ్మీరీ పండిట్లపై అకృత్యాలకు పాల్పడినవారిని, గోవధ కోసం ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకున్న గోరక్షకులను ఒకే గాటన కడుతూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవ సమానమైన గోవులను కాపాడేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది" అని విజయశాంతి ట్వీట్ చేసింది.
దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం, తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఒకటే ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించింది. ఎవరైనా సరే అవగాహన లేని విషయాలపై మాట్లాడే సమయంలో సున్నితమైన అంశాలను పక్కనపెడితే మంచిదని సూచించింది. అయితే విరాట పర్వం సినిమా ఆర్థిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ మూవీతో పోలిక తెచ్చి ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ను ఇలా సమస్యల్లోకి లాగినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయని మరో ట్వీట్ విజయశాంతి అభిప్రాయపడింది.
సంబంధిత కథనం
టాపిక్