Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో రిలేషన్‌షిప్‌ను అందుకే బయటపెట్టా.. అలా కావద్దనే..: విజయ్ వర్మ కామెంట్స్
Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో తన రిలేషన్‌షిప్‌ను చాలా త్వరగా బయటపెట్టడానికి కారణమేంటో చెప్పాడు నటుడు విజయ్ వర్మ. ఈ లవ్ బర్డ్స్ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల్లా దాగుడుమూతలు ఆడకుండా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు అంగీకరించడం విశేషం.
Vijay Varma Tamannaah Bhatia: తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్న విషయం తెలుసు కదా. సాధారణంగా సెలబ్రిటీ కపుల్ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ను అంత త్వరగా బయటపెట్టరు. దానిని సాధ్యమైనంత వరకూ సీక్రెట్ గా ఉంచడానికే ప్రయత్నిస్తారు. కానీ ఈ జంట మాత్రం ఎక్కువ కాలం మీడియాకు, సోషల్ మీడియాకు, అభిమానులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీనికి కారణమేంటో తాజాగా విజయ్ వెల్లడించాడు.
ఆ పంజరంలో బందీ కావద్దనే..
తమన్నాతో రిలేషన్‌షిప్ పై ఈ మధ్యే శుభాంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్లో విజయ్ వర్మ మాట్లాడాడు. తనతోపాటు తన ఫీలింగ్స్ పంజరంలో బందీగా మారకూడదన్న ఉద్దేశంతోనే మొదట్లోనే తమ డేటింగ్ విషయాన్ని వెల్లడించినట్లు విజయ్ తెలిపాడు. సీక్రెట్ గా ఉంచితే తాము పడే కష్టాల గురించీ చెప్పుకొచ్చాడు.
"ఇద్దరం కలిసి ఉండాలని మేము భావించాం. అలా ఒకరినొకరు ఇష్టపడినప్పుడు ఇక దాచాల్సిన పని లేదు. ఓ రిలేషన్‌షిప్ ను దాచాలంటే చాలా కష్టపడాలి. కలిసి బయటకు వెళ్లలేం. ఫ్రెండ్స్ మా ఫొటోలను తీయలేరు. అలాంటి ఆంక్షలు నాకు నచ్చవు. నన్ను నేను బందీ చేసుకోలేను. నా ఫీలింగ్స్ ను బందీ చేసుకోలేను" అని అన్నాడు.
ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు 5 వేలు
తమన్నా, తాను కలిసి సుమారు 5 వేల ఫొటోలు దిగామని, అవన్నీ తన దగ్గర ఉన్నట్లు కూడా ఈ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పాడు. కానీ వాటిని ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదన్నాడు. ఆ ఫొటోలు కేవలం తమ కోసం తాము దిగినవే అని చెప్పాడు. ఈ బంధం తన వృత్తిపై ప్రభావం చూపిస్తుందా అని అడిగినప్పుడు కూడా విజయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
"ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవతలి వాళ్ల జీవితాలపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ పుకార్లు పుట్టించే ఓ ఆంటీ ఉంది. వాళ్లు కేవలం ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదొక వ్యాధిలా మారిపోయింది. దీనిపై మనం చేయగలిగిందేమీ లేదు. నేనూ మార్చలేను. ఇక నా పని వరకూ వస్తే ప్రతి రిలీజ్ తర్వాత నాకు రావాల్సిన గుర్తింపు వస్తోంది" అని విజయ్ చెప్పాడు.
తమన్నా, విజయ్ డేటింగ్
తమన్నా, విజయ్ రిలేషన్షిప్ పై గతేడాది తొలిసారి వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడంతో పుకార్లు మొదలయ్యాయి. వీళ్లు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కావడానికి కొన్ని నెలల ముందు వీళ్లు ఇలా సన్నిహితంగా కనిపించడం ఆసక్తి రేపింది.
నిజానికి తమన్నా కూడా తన కెరీర్లో తొలిసారి తాను పెట్టుకున్న ఆంక్షలను పక్కన పెట్టి విజయ్ తో ఈ సిరీస్ లో లిప్ లాక్ సీన్ చేసింది. ఆ బోల్డ్ సీన్ లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీకే హైలైట్ గా నిలిచింది. ఈ సిరీస్ సందర్భంగానే తాము క్లోజ్ అయ్యామని, తాము డేటింగ్ చేస్తున్న మాట నిజమే అని గతేడాది జూన్ లో తమన్నా ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.