Sankranthi Releases 2023: ఎలివేష‌న్స్ ఫుల్ - కంటెంట్ నిల్ - సంక్రాంతి సినిమాలపై విమర్శలు-tollywood sankranthi movies trolls on veera simha reddy waltair veerayya movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Tollywood Sankranthi Movies Trolls On Veera Simha Reddy Waltair Veerayya Movies

Sankranthi Releases 2023: ఎలివేష‌న్స్ ఫుల్ - కంటెంట్ నిల్ - సంక్రాంతి సినిమాలపై విమర్శలు

విజయ్ వారసుడు
విజయ్ వారసుడు

Sankranthi Releases 2023: సంక్రాంతికి రిలీజైన సినిమాల క‌లెక్ష‌న్స్ బాగున్నా కంటెంట్ పూర్ అంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఈ సినిమాల్లో ఎలాంటి కొత్త‌ద‌నం లేద‌ని అంటున్నారు.

Sankranthi Releases 2023:టాలీవుడ్‌లో చాలా రోజులుగా ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ‌ను రేకెత్తించిన సంక్రాంతి స‌మ‌రం ఓ కొలిక్కి వ‌చ్చింది. సంక్రాంతి సినిమాలు ఎలా ఉండ‌బోతున్నాయోన‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. నాలుగు రోజుల్లో మొత్తం ఐదు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

జ‌న‌వ‌రి 11న తెగింపు, 12న బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి (Veerasimha Reddy) సినిమాలు రిలీజ్ అయ్యాయి. జ‌న‌వ‌రి 13న వాల్తేర్ వీర‌య్య‌తో (Waltair Veerayya)చిరంజీవి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. జ‌న‌వ‌రి 14న విజ‌య్ వార‌సుడుతో (Vijay Varasudu) పాటు చిన్న సినిమా క‌ళ్యాణం క‌మ‌నీయం ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాయి. క‌లెక్ష‌న్స్ ప‌రంగా సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల బాగానే ఉన్నా కంటెంట్ విష‌యంలో మాత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకోలేక‌పోయాయి.

సంక్రాంతికి రిలీజైన వాల్తేర్ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డితో పాటు మిగిలిన సినిమాల్లో కంటెంట్ వీక్ అనే విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లుగా రూపొందాయి. ఈ రెండు సినిమాల్లో క‌థ కంటే హీరోయిజం, క‌మ‌ర్షియ‌ల్ హంగులు, యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్లు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

ఒకే పాయింట్‌...రెండు సినిమాలు...

వీర‌సింహారెడ్డి సినిమాలో దాదాపు ఎనిమిది ఫైట్లు, ఐదు పాట‌లు ఉన్నాయి. వాటి మ‌ధ్య క‌థ క‌నిపించ‌కుండా పోయింద‌నే కామెంట్స్ బ‌లంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు వీర‌సింహారెడ్డి, వాల్తేర్ వీర‌య్య రెండు సినిమాలు ఇంచుమించు ఒక‌టే లైన్‌తో రూపొందాయి. వీర‌సింహారెడ్డి సినిమా స‌వ‌తి అన్నాచెల్లెళ్ల మ‌ధ్య సాగితే వాల్తేర్ వీర‌య్య స‌వ‌తి అన్నాద‌మ్ముల మ‌ధ్య న‌డుస్తుంది. ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తూ అభిమానులు తెగ ట్వీట్స్ చేస్తున్నారు.

రెండు సినిమాలు రివేంజ్ డ్రామాలుగానే తెర‌కెక్కాయి. ఈ సినిమాల కోసం ఎంచుకున్న పాయింట్ల‌తో గ‌తంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. క‌మ‌ర్షియ‌ల్ మాస్ మ‌సాలా సినిమాల‌ పేరుతో పాత క‌థ‌ల‌కే కొత్త హంగులు అద్ది పండుగ బ‌రిలోకి టాలీవుడ్ స్టార్స్ దిగార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

వాల్తేర్‌ వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల్లో చాలా వ‌ర‌కు హింస మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వీర‌సింహారెడ్డి సినిమాలో త‌ల‌లు న‌రికే స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. ఆడంగి వెధ‌వ‌, ముండా అంటూ బాల‌కృష్ణ‌ చెప్పే డైలాగ్స్ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఫ‌స్ట్ సీన్ నుంచి చివ‌ర‌కు వ‌ర‌కు స్క్రీన్ నిండా ర‌క్తం ఏరులై పారుతూనే ఉంటుంది.

మితిమీరిన హింసాత్మ‌క స‌న్నివేశాల‌తో హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించ‌వ‌చ్చున‌నే భ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను చేసిన‌ట్లుగా అనిపిస్తోంద‌ని కొంద‌రు చెబుతున్నారు. వాల్తేర్ వీర‌య్య‌ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అలాగే సాగాయి. క‌థ‌, క‌థ‌నాలు, యాక్టింగ్ ప‌రంగా కొత్త‌ద‌నం పాళ్లు ఈ రెండు సినిమాల్లో భూత‌ద్ధం పెట్టి వెతికినా క‌నిపించ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

తెగింపు వ‌ర్సెస్ వార‌సుడు

మ‌రోవైపు ఈ సంక్రాంతికి డ‌బ్బింగ్ సినిమాలు విజ‌య్ వార‌సుడు అజిత్ తెగింపు (Ajith Tegimpu) కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. త‌మిళ ద‌ర్శ‌కులు అన‌గానే కొద్దో గొప్పో క‌థ‌ల‌కు ఇంపార్టెన్స్ ఇస్తార‌నే పేరుంది. కానీ ఆ న‌మ్మ‌కాన్ని అజిత్‌, విజ‌య్ సినిమాలు పూర్తిగా వ‌మ్ము చేశాయి. హీరోల ఇమేజ్‌, వారిని స్టైలిష్‌గా చూపించ‌డం, మేన‌రిజ‌మ్స్ త‌ప్పితే క‌థ‌ల విష‌యంలో రెండు సినిమాలు పూర్‌గానే నిలిచాయి.

తెగింపు సినిమా బ్యాంక్ మోసాల పాయింట్‌తో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు హెచ్ వినోద్‌. ఇందులో ఇంట‌ర్‌నేష‌న‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా అజిత్ క‌నిపించాడు. రెండున్న‌ర గంట‌ల సినిమాలో అజిత్ స్టైలిష్‌గా చూపించ‌డం, అత‌డి హీరోయిజాన్ని ఆవిష్క‌రించ‌డానికి ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డిన‌ట్లుగా క‌నిపించింది. మైఖేల్ జాక్స‌న్ స్టెప్పులు వేయిస్తూ, కామెడీ చేస్తూ సినిమా మొత్తం టైమ్ పాస్ చేశాడు. యాక్ష‌న్ సీన్స్ గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచింది.

రొటీన్ ఫ్యామిలీ డ్రామా

వార‌సుడులో విజ‌య్ గ‌త సినిమాల కంటే స్టైలిష్‌గా క‌నిపించాడు, డ్యాన్సులు బాగా చేశాడు. అంత వ‌ర‌కు కామెంట్స్ బాగానే ఉన్నా క‌థ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం వార‌సుడు తేలిపోయాడు. త‌న కుటుంబానికి ఎదురైన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ఓ యువ‌కుడి క‌థ ఇది.

ప్ర‌తి ఫ్రేమ్‌లో వార‌సుడు గ‌తంలో తెలుగులో వ‌చ్చిన ఏదో సినిమాను గుర్తుకు తెస్తునే ఉంటుంద‌నే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడ‌ని చెబుతున్నారు. కంటెంట్ విష‌యంలో చిన్న సినిమా క‌ళ్యాణం క‌మ‌నీయం భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. హీరోహీరోయిన్ల న‌ట‌న త‌ప్పితే సినిమా మొత్తం రొటీన్‌గానే ఉంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.