Shatamanam Bhavati Sequel: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ శతమానం భవతికి సీక్వెల్ రాబోతోంది. సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 2025 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. ఈ సీక్వెల్‌లో నటించనున్న హీరోహీరోయిన్లు ఎవరన్నది త్వరలోనే రివీల్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
2017లో రిలీజైన శతమానం భవతి మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా నేషనల్ అవార్డును దక్కించుకున్నది. 2017 సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈమూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు పోటీగా రిలీజై ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది.
శతమానం భవతిలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి.
దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నలభై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు 16 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. శతమానం భవతి నెక్స్ట్ పేజీని కొత్త నటీనటులతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది సంక్రాంతికి శతమానం భవతి నెక్స్ట్ పేజీతో పాటు చిరంజీవి విశ్వంభర రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, శతమానం భవతి రిలీజయ్యాయి. మళ్లీ చిరంజీవి సినిమాకు పోటీగా శతమానం భవతి సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శతమానం భవతి సీక్వెల్‌కు డైరెక్టర్ మారనున్నట్లు సమాచారం. శతమానం భవతికి రైటర్‌గా పనిచేసిన హరి ఈ సీక్వెల్‌కు కథను అందిస్తున్నట్లు తెలిసింది. అతడే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా...మరో డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇటీవలే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు దిల్‌రాజు.
ఈ బ్యానర్‌పై నిర్మించిన బలగం పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో పలు చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు దిల్‌రాజు. ఈ బ్యానర్‌లోనే శతమానం భవతి నెక్స్ట్ పేజీ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు దిల్‌రాజు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ జరుగుతోంది.