Tollywood | రామ్-బోయపాటి శ్రీను సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది..
‘అఖండ’ విజయం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని హీరో రామ్ తో చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడింది. రామ్ హీరోగా నటిస్తున్న 20వ సినిమా ఇది.
టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రం గత ఏడాది టాలీవుడ్ తో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అఘోరాగా బాలకృష్ణ క్యారెక్టర్ ను దర్శకుడు బోయపాటి శ్రీను తీర్చిదిద్దిన విధానం, ఆయనపై తెరకెక్కిన యాక్షన్స్ సీక్వెన్స్, ఎలివేషన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ సినిమాతో మాస్ డైరెక్టర్ గా తన సత్తా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు బోయపాటి శ్రీను. తన తదుపరి చిత్రాన్ని హీరో రామ్ తో చేస్తున్నారాయన. ఈ సినిమాను అధికారికంగా శుక్రవారం హీరో రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. మాస్, ఎమోషన్స్ వెండితెరపై ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నన్ను నేను తెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ రామ్ పేర్కొన్నారు తనదైన శైలి మాస్ యాక్షన్ హంగులతో బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.