Rajinikanth felicitated Madhavan: రాకెట్రీ సక్సెస్.. మాధవన్‌ను సత్కరించిన రజనీకాంత్
Rajinikanth felicitated Madhavan: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ మూవీ సక్సెస్‌తో మాధవన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడా మూవీలో నటించిన మాధవన్‌తోపాటు రియల్ లైఫ్ హీరో, ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్‌లను సత్కరించాడు సూపర్‌స్టార్ రజనీకాంత్.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాకెట్రీ మూవీని సత్కరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ మూవీ హీరో మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం షేర్ చేశాడు. రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో రజనీ మాధవన్‌తోపాటు ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్‌లను సత్కరించాడు. రాకెట్ సైన్స్‌లో దేశం అభివృద్ధి కోసం ఎంతో చేసినా కుట్రలకు బలైన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కింది.
దీంతో ఈ ఇద్దరినీ రజనీ తన ఇంట్లో సన్మానించాడు. వాళ్లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో మాధవన్ వెల్లడిస్తూ.. "ఇండస్ట్రీ లెజెండ్ నుంచి మాకు ఆశీర్వాదం లభించింది. మరో లెజెండ్ సమక్షంలో ఇది దక్కింది. ఇది చాలా గొప్ప విషయం. మీ మంచి మనసుకు కృతజ్ఞతలు రజనీకాంత్ సర్. ఈ మోటివేషన్ మాలో పునరుజ్జీవాన్ని నింపింది" అని అన్నాడు.
ఈ రాకెట్రీ మూవీని మాధవనే డైరెక్ట్ చేశాడు. నంబి నారాయణన్ పాత్రలోనూ అతడే కనిపించాడు. మాధవన్‌కు డైరెక్టర్‌గా ఇదే తొలి సినిమా. సిమ్రన్, రంజిత్ కపూర్, సూర్యలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. 1994లో ఇస్రో సైంటిస్ట్‌గా ఉన్న నంబి నారాయణన్‌పై కుట్రపూరితంగా దేశద్రోహి ముద్ర వేసి జైలు పాలు చేసి చిత్ర హింసలు పెట్టిన ఘటనను ఈ సినిమా కళ్లకు కట్టింది.
ఈ సినిమా జులై 26న ఓటీటీల్లోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. దేశ స్వాతంత్ర్యం తర్వాత రాకెట్ సైన్స్ అభివృద్ధి కోసం ఇస్రో పడిన పాట్లు, అందులో నంబి నారాయణన్ పోషించిన ముఖ్యమైన పాత్రను ఈ రాకెట్రీ మూవీ చూపించింది. 24 ఏళ్లపాటు తనపై కుట్రపూరితంగా మోపిన దేశద్రోహం కేసుపై పోరాడిన నంబికి 2018లో సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతోపాటు రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. 2019లో ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.