RRR on IMDB Rating | ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఐఎండీబీ రేటింగ్‌లో టాప్-5లో చోటు
ఆర్ఆర్ఆర్ సినిమా అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ కంపెనీ(ఐఎండీబీ).. అత్యంత ప్రాచుర్యం పొందుతున్న టాప్-5 చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్‌కు చోటు కల్పించింది. ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోందీ చిత్రం.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు, రాజమౌళి టేకింగ్‌కు ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. విడుదలైన 10 రోజుల్లోనే రూ.900 కోట్ల పైచిలుకు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఆర్ఆర్ఆర్.
ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(IMDB).. ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందుతున్న టాప్-5 సినిమాల్లో ఈ చిత్రానికి చోటు కల్పించింది. అంతేకాదు ఐఎండీబీ ఇచ్చిన రేటింగుల్లో హాలీవుడ్ చిత్రాన్నింటి కంటే కూడా ఆర్ఆర్ఆర్‌కే ఎక్కువ ఇవ్వడం విశేషం. ఆస్కార్ గెలిచిన కోడా సినిమాను తోసిరాజని ఆర్ఆర్ఆర్ అత్యధిక రేటింగ్(9.0)ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందుతున్న చిత్రాల జాబితాలో కోడా(8.1) మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో డెత్ ఆన్ ది నైల్(6.4), మార్బియస్(5.2), ది బ్యాట్‌మ్యాన్(8.3) మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఆర్ఆర్ఆర్ 9.0 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఉన్న హాలీవుడ్ చిత్రాలన్నింటికంటే అత్యధిక రేటింగ్ ఉన్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. మిగిలిన చిత్రాలు ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్న చిత్రాలుగా గుర్తించినవిగా ముందు వరుసలో ఉన్నాయి.
మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. రూ.1000 కోట్ల మైలురాయి దిశగా వేగంగా పరుగులు తీస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఆమీర్ ఖాన్ నటించిన పీకే, రజినీకాంత్ రోబో 2.0ను అధిగమించింది. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో సీక్రెట్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్ బజరంగీ భాయ్‌జాన్ చిత్రాల రికార్డులను కూడా బద్దలుకొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
సంబంధిత కథనం
టాపిక్