OTT: 2 ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ సిరీస్.. ప్రియమణి 'సర్వం శక్తిమయం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sarvam Shakthi Mayam OTT Release: బ్యూటిఫుల్ ప్రియమణి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై కనువిందు చేస్తూనే సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలతో ఆకట్టుకుంటోంది. తాజాగా సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీసుతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది.
Priyamani Sarvam Shakthi Mayam Web Series: టాలీవుడ్ పాపులర్ హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటి జగపతిబాబు పెళ్లైన కొత్తలో మూవీతో మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాతో తెలుగువారికి విపరీతంగా వచ్చేసింది. అనంతరం హరే రామ్, ద్రోణ, గోలీమార్, శంభో శివ శంభో, రగడ వంటి తదితర చిత్రాలతో ఎంటర్టైన్ చేసింది. గత కొంతకాలంగా నటిగా అలరిస్తూ వస్తోంది.
విరాటపర్వం, నారప్ప, జవాన్ వంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలతో ఆకట్టుకుంది ప్రియమణి. భామాకలాపం సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఇప్పుడు సర్వం శక్తిమయం వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. ఇందులో సంజయ్ సూరి మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ఈ సిరీసుకు బీవీఎస్ రవి కథ అందించడంతోపాటు క్రియేటర్‌గా ఉన్నారు.
అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని నిర్మాతలుగా, హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ ఓటీటీ విడుదల తేదిని తాజాగా ప్రకటించారు. ప్రియమణి సర్వం శక్తిమయం సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో తెలుగులో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. జీ5లో హిందీలో అందుబాటులో ఉంది. అష్టాదశ శక్తి పీఠాల గురించి ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు సమాచారం. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారానికి కుటుంబంతో కలిసి శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఎదురైన సమస్యలు, పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలోని మార్పు వంటి తదితర అంశాల చుట్టూ కథ తిరుగుతుందట.
అలాగే నాస్తుకుడు ఆస్తికుడయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చించేలా కథ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ సిరీస్ ద్వారా భారతదేశంలోని 17 శక్తిపీఠాలతోపాటు శ్రీలంకలోని శక్తిపీఠాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చను చెబుతున్నారు. కాగా దసరాకు విడుదల కానున్న సర్వం శక్తిమయం వెబ్ సిరీసులో మొత్తంగా పది ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం.