Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-prasanna vadanam review suhas rashi singh crime thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 03, 2024 10:45 AM IST

Prasanna Vadanam Review:సుహాస్‌, పాయ‌ల్ రాధాకృష్ణ‌, రాశీసింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

 ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మూవీ రివ్యూ
ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మూవీ రివ్యూ

Prasanna Vadanam Review: స‌హ‌జ‌త్వంతో కూడిన ప్రేమ‌క‌థ‌ల‌తో హీరోగా టాలీవుడ్‌లో చ‌క్క‌టి విజ‌యాల్ని అందుకున్నాడు సుహాస్‌ (Suhas). త‌న పంథాకు భిన్నంగా తొలిసారి క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను ఎంచుకొని సుహాస్ న‌టించిన తాజా సినిమా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం(Prasanna Vadanam Movie). ఈ మూవీ అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.శుక్ర‌వారం ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రాశీసింగ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా న‌టించారు.ప్ర‌స‌న్న వ‌ద‌నం సినిమా ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో సుహాస్ హిట్ కొట్టాడా? లేదా? అంటే?

సూర్య ఫేస్ బ్లైండ్‌నెస్ ఇబ్బందులు...

సూర్య (సుహాస్) ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జేగా ప‌నిచేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. ఎదుటి వారి ముఖాల‌ను, వారి వాయిస్‌ను గుర్తుప‌ట్ట‌లేడు. త‌న‌కున్న స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డ‌కుండా తెలివిగా మ్యానేజ్ చేస్తుంటాడు. అమృత( సాయి శ్వేతా)ని అనే అమ్మాయి సూర్య క‌ళ్ల ముందే హ‌త్య‌కు గురువుతుంది. ఆమెను లారీ కింద తోసేసి చంపేస్తారు.

సూర్య‌కు ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం వ‌ల్ల హంత‌కుడిని గుర్తించ‌లేడు. హ‌త్య‌కు గురైన అమృత‌కు న్యాయం జరగాలని భావించిన సూర్య.. పోలీసుల‌కు హ‌త్య గురించి చెబుతాడు? అమృత మ‌ర్డ‌ర్ కేసును సాల్వ్ చేసే బాధ్య‌త‌ను చేప‌ట్టిన ఏసీపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) కేసులోని నిజాల‌ను ఎలా వెలికితీశారు ?

ఈ కేసులో నిందితుడిగా సూర్య ఎలా మారాడు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఏ విధ‌మైన‌ కష్టాలు ఎదుర్కున్నాడు ? అసలు అమృత ఎవరు ? తనని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? ఆద్య (పాయ‌ల్ రాధాకృష్ణ‌) అనే అమ్మాయిని ప్రేమించిన సూర్య త‌న‌కున్న స‌మ‌స్య గురించి ఆమెకు చెప్పాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ...

క్రైమ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాల్లో చాలా వ‌ర‌కు హీరో అనుకోకుండా నేరంలో చిక్కుకోవ‌డం, ఆ క్రైమ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న తెలివితేట‌ల‌తో వేసిన ఎత్తులు, చివ‌ర‌కు హంత‌కుడిని ప‌ట్టుకోవ‌డంతో ముగుస్తుంటాయి. ప్రసన్న వదనం కూడా అలాంటి మూవీనే.

కానీ ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త పాయింట్‌ను ఈ క్రైమ్ క‌థ‌లో మిక్స్ చేసి ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు ద‌ర్శ‌కుడు అర్జున్ ప్ర‌య‌త్నించారు. ఈ ఫేస్ బ్లైండ్‌నెస్ అనే పాయింట్‌తో గ‌తంలో తెలుగులో సినిమాలు రాక‌పోవ‌డంతో పాటు సుహాస్ కామెడీ టైమింగ్, నాచుర‌ల్ యాక్టింగ్‌ ఈ సినిమా ప్ల‌స్స‌య్యాయి.

ఫ‌స్ట్ హాఫ్ ఫ‌న్‌...

హీరోతో పాటు అత‌డి ఫ్యామిలీకి యాక్సిడెంట్ ఆయ్యే సన్నివేశంతోనే సినిమా మొద‌ల‌వుతుంది. ఈ ప్ర‌మాదంలో హీరోకు ఫేస్ బ్లైండ్ నెస్ స‌మ‌స్య‌రావ‌డం, త‌న‌కున్న స‌మ‌స్య ఇత‌రుల‌కు తెలియ‌కుండా హీరో తెలివిగా మ్యానేజ్ చేసే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి ముఖ్యంగా ప్రియురాలు ఆద్య త‌న ఫేస్ బ్లైండ్‌నెస్ ను క‌నిపెట్ట‌కుండా స్నేహితుడు విఘ్నేష్ స‌హాయంతో హీరో వేసే ప్లాన్స్ నుంచి కామెడీ బాగావ‌ర్క‌వుట్ అయ్యింది.

క్రైమ్ వైపు ట‌ర్న్‌...

హీరో క‌ళ్ల ముందే హ‌త్య జ‌ర‌గ‌డంతో సినిమా క్రైమ్ థ్రిల్ల‌ర్ వైపుకు ట‌ర్న్ తీసుకుంటుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశారు డైరెక్ట‌ర్‌. మ‌ర్డ‌ర్‌కు సాక్షిగా ఉన్న సూర్య ఆ కేసులో నిందితుడిగా ఎలా మారాడు?

తెలివిగా అత‌డిని ఈ కేసులో ఎవ‌రు ఇరికించార‌న్న‌ది చ‌క్క‌టి మ‌లుపుల‌తో ద‌ర్శ‌కుడు రాసుకున్నాడు. అస‌లు విల‌న్ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే సీన్ కూడా స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ఆ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ట్విస్ట్‌ను బ‌య‌ట‌పెట్ట‌డం బాగుంది.

వేగం త‌గ్గింది...

థ్రిల్ల‌ర్ సినిమాల్లో ఉండే వేగం ఈ సినిమాల్లో కొన్ని చోట్ల మిస్స‌యింది. ఫ‌స్ట్ హాఫ్ కామెడీతో లాగించేశారు డైరెక్ట‌ర్‌. ఆ సీన్స్‌లో కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ కాలేదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మ‌రింత డెప్త్‌గా రాసుకుంటే బాగుడేంది.

సుహాస్ కామెడీ టైమింగ్‌...

ఫేస్ బ్లైండ్‌నెస్‌తో ఇబ్బందిప‌డే సూర్య అనే యువ‌కుడిగా సుహాస్‌ నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. గ‌తంలో ఎక్కువ‌గా సోష‌ల్ ఇష్యూస్‌, కామెడీ టైప్ క్యారెక్ట‌ర్స్ చేసిన సుహాస్‌ ఇందులో న‌టుడిగా కొత్త‌గా క‌నిపించాడు. త‌న‌దైన శైలి కామెడీ టైమింగ్‌తో న‌వ్విస్తూనే ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మెప్పించాడు.

అత‌డికెరీర్‌లో డిఫ‌రెంట్ మూవీగా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం నిలుస్తుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా రాశీ సింగ్ యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. అంబాజీపేట మ్యారేజీబ్యాండులో విల‌న్‌గా క‌నిపించిన నితిన్ ప్ర‌స‌న్న ప్ర‌స‌న్న‌వ‌ద‌నంలో కీల‌క పాత్ర చేశాడు. హీరో ప్రియురాలిగా పాయ‌ల్ రాధాకృష్ణ‌, స్నేహితుడిగా వైవా హ‌ర్ష న‌వ్వించారు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్‌కు...

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ. స‌స్పెన్స్ జోన‌ర్ మూవీస్‌నే ఇష్ట‌ప‌డే వారిని త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది. న‌టుడిగా సుహాస్‌ను కొత్త కోణంలో చూపించిన మూవీ ఇది.

రేటింగ్‌:3/5

Whats_app_banner