Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’ సినిమా హిందీ వెర్షన్ ఆలస్యం కానుందా?
Thangalaan OTT: తంగలాన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ మూవీ హిందీ వెర్షన్ విషయంలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెర్షన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలివే..
తంగలాన్ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ తమిళ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇంకా ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లను ఈ చిత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు తంగలాన్ రెడీ అవుతోంది.
తంగలాన్ చిత్రం అక్టోబర్ 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, నెట్‍ఫ్లిక్స్ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఆరోజునే తంగలాన్ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను దీపావళికి నెట్‍ఫ్లిక్స్ షెడ్యూల్ చేసిందని ఈ మూవీ నిర్మాత జ్ఞానవేల్ కూడా ఇటీవలే చెప్పారు.
ఓటీటీలోనూ హిందీ వెర్షన్ ఆలస్యం
తంగలాన్ చిత్రం హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆలస్యమవుతుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలతో హిందీ వెర్షన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. థియేటర్లలోనూ ఆలస్యంగా సెప్టెంబర్ 6న తంగలాన్ హిందీ వెర్షన్ రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ తంగలాన్ హిందీ వెర్షన్ ఆలస్యం కానుందని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇటీవలే కోర్టులో గ్రీన్‍సిగ్నల్
తంగలాన్ చిత్రం సెప్టెంబర్ ఆఖరులోని ఓటీటీలోకి రావాల్సింది. అయితే, కోర్టులో కేసు వల్ల ఆలస్యమైనట్టు సమచారం బయటికి వచ్చింది. వైష్ణవులను కించపరిచే అంశాలు ఈ మూవీలో ఉన్నాయని, ఈ చిత్రాన్ని ఓటీటీలోకి రాకుండా ఆదేశించాలని ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం.. మద్రాసు హైకోర్టులో దాఖలైంది. విచారణ తర్వాత ఈ పిల్‍ను కోర్టు గత వారంలోనే కొట్టేసింది. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ స్ట్రీమింగ్‍కు గ్రీన్‍సిగ్నల్ వచ్చేసింది.
తంగలాన్ చిత్రాన్ని భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బంగారం కోసం చేసిన అన్వేషణ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ మూవీలో విక్రమ్ సహా పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి ముఖ్యమైన పాత్రలు పోషించారు. డేనియల్ కాల్టగిరోన్, హరికృష్ణన్, వెట్టై ముత్తుకుమార్ కీరోల్స్ చేశారు.
తంగలాన్ చిత్రాన్ని గ్రీన్ స్టూడియో పతాకంపై కేఈ జ్ఞానవేల్ ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందిందిన ఈ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇవ్వగా.. ఏ.కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.