OTT Murder Mystery Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో మర్డర్ మిస్టరీ మూవీ.. ఫ్రీగా చూడొచ్చు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Murder Mystery Movie: ఇప్పుడు మరో మర్డర్ మిస్టరీ మూవీ నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాను ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. ట్రైలర్ లోని ట్విస్టులతోనే ఆసక్తి రేపుతూ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూడండి.
OTT Murder Mystery Movie: ఓటీటీలోకి ఓ మర్డర్ మిస్టరీ మూవీ రాబోతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతున్న సినిమా ఇది. అంతేకాదు ఈ సినిమాను ఎవరైనా ఫ్రీగా చూసే అవకాశం కల్పించడం విశేషం. ఈ మూవీ ట్రైలర్ ను బుధవారం (ఆగస్ట్ 21) సాయంత్రం రిలీజ్ చేయగా.. ఇందులోని ట్విస్టులు ఆసక్తి రేపుతున్నాయి.
ఇంటరాగేషన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్
జీ5 ఓటీటీలోకి రాబోతున్న ఈ మర్డర్ మిస్టరీ మూవీ పేరు ఇంటరాగేషన్. దర్శన్ జరీవాలా, రాజ్‌పాల్ యాదవ్, గిరీష్ కులకర్ణి, యశ్‌పాల్ శర్మ నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం రిలీజైన ట్రైలర్ ఈ సినిమా జానర్ తోపాటు ఇందులో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో స్పష్టం చేసింది.
ఓ రిటైర్డ్ జడ్జి హత్య చుట్టూ తిరిగే కథ ఇది. ఒంటరిగా జీవించే ఆ వ్యక్తి ఎలా హత్యకు గురయ్యాడు? ఎవరు హత్య చేశారు? అన్నది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించిన దర్శన్ జరీవాలా తేల్చనున్నాడు. ఈ హత్యలో ప్రధానంగా నలుగురు అనుమానితులు ఉన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. వాళ్లను విచారిస్తుండగా.. కొన్ని ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి.
ఇంటరాగేషన్ మూవీ ట్రైలర్
ఇంటరాగేషన్ మూవీ ట్రైలర్ చూస్తుంటేనే ఓ మర్డర్ మిస్టరీ మూవీలో ఉండాల్సిన సస్పెన్స్ కనిపిస్తోంది. మాజీ జడ్జి హత్య ఎవరు చేశారన్నది ఛేదించాల్సిన విషయం. ట్రైలర్ లో నలుగురినీ అనుమానితులుగా చూపించినా.. అందులో ఎవరు చేశారన్నది అంచనా వేయడం కష్టమే. మూవీలోనూ చివరి వరకూ ఇదే పాయింట్ ను సీక్రెట్ గా ఉంచబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమాపై ఇందులో నటించిన ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడాడు. "ఇది పిల్లి, ఎలుకలాంటి ఓ సైకలాజికల్ గేమ్. జీ5 నుంచి వచ్చిన మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు థ్రిల్లింగా ఉంది. చివరి వరకూ సస్పెన్స్ ను అంచనా వేస్తూ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టే సినిమా ఇది" అని అతడు అన్నాడు.
అసలు ఆ హత్య ఎవరు, ఎందుకు చేశారు? ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించబోతున్నారో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఇంటరాగేషన్ మూవీ చూస్తేనే తెలుస్తుంది. అజోయ్ వర్మ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.