Netflix | మా కంటెంట్ నచ్చకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి!
కాస్త బోల్డ్ కంటెంట్‌ను అందించే ఓటీటీల్లో ముందుండేది నెట్‌ఫ్లిక్స్. మిగతా ఓటీటీలతో పోలిస్తే ఈ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు కూడా ఎక్కువే.
ఇంగ్లిష్ అయినా, హిందీ అయినా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఎప్పుడూ కాస్త బోల్డ్‌గానే ఉంటుంది. అయితే వయెలెన్స్ లేదంటే సెక్స్ మోతాదు ఈ నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌లో ఎక్కువ. దీనిపై ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉన్నా.. తమ కంటెంట్‌కు సంబంధించి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం నెట్‌ఫ్లిక్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన కల్చర్ గైడ్‌లైన్స్‌లో కాస్త కఠినమైన నిబంధనలనే ఉంచింది.
తాము అంగీకరించలేని, తమకు ఇష్టం లేని కంటెంట్‌పై కూడా పని చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆ కంటెంట్‌తో ఏకీభవించని ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లొచ్చనీ చెప్పడం గమనార్హం. ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్ అనే కాలమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఏ కంటెంట్ కావాలో ఆడియెన్స్ తేల్చుకోవాలని, నెట్‌ఫ్లిక్స్ సెన్సార్ చేయదని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది.
స్టోరీల్లో వైవిధ్యం కోసం తాము చూస్తున్నామని, ఒకవేళ వాటిలో కొన్ని కంపెనీ వ్యక్తిగత విలువలకు విరుద్ధంగా ఉన్నా కూడా నష్టం లేదని చెప్పడం విశేషం. మీ రోల్‌ను బట్టి మీరు హానికరమని భావించిన కంటెంట్‌పై కూడా పని చేయాల్సిందే అని ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఒకవేళ అది నచ్చకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగం మానేసి వెళ్లిపోవచ్చనీ చెప్పింది.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్లు తీసుకొచ్చే దిశగా కూడా కంపెనీ పని చేస్తోంది. అందులో భాగంగా లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాలని భావిస్తోంది. స్టాండప్ స్పెషల్స్, కామెడీ షోలు, స్క్రిప్ట్ లేని షోలను ఇలా లైవ్ స్ట్రీమ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్