Nagabandham Glimpse: అద్భుతమైన విజువల్స్‌తో నాగబంధం గ్లింప్స్.. ఆ ఆలయం మిస్టరీ గురించే!
Nagabandham Movie Glimpse: నాగబంధం సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో చాలా ఇంట్రెస్టింగ్‍గా ఈ గ్లింప్స్ సాగింది. ఓ నిధి రహస్యం గురించి ఈ చిత్రం ఉండనుంది.
Nagabandham Glimpse: నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామాకు చెందిన ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ పిక్చర్స్ కొంతకాలంగా ఓ పోస్టర్‌తో ఆసక్తిని పెంచుతూ వస్తోంది. రుషి ఓ పర్వతం వైపు ఆగ్ని మధ్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతూ వస్తోంది. ఏ చిత్రం గురించో అనే చర్చ సాగింది. ఈ తరుణంలో నేడు (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ చిత్రానికి నాగబంధం అనే టైటిల్‍ను ఖరారు చేశారు మేకర్స్.
నాగబంధం చిత్రానికి అభిషేక్ నామానే దర్శకత్వం వహిస్తున్నారు. గూఢచారి, రావణాసుర సహా నిర్మాతగా కొన్ని చిత్రాలు చేసిన అభిషేక్.. గతేడాది డెవిల్ చిత్రంతో దర్శకుడిగానూ మారారు. డైరెక్టర్‌గా నాగబంధం ఆయనకు రెండో సినిమాగా ఉంది. పురాణాలతో కూడిన పీరియడ్ అడ్వెంచర్ మూవీగా నాగబంధం ఉండేలా కనిపిస్తోంది. నేడు వచ్చిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్‍గా, గ్రాండ్ విజువల్స్‌తో ఉంది.
గ్లింప్స్ ఇలా..
హిమాలయాల షాట్‍తో ఈ గ్లింప్స్ మొదలైంది. అక్కడి నుంచి ఓ గద్ద ప్రయాణిస్తూ ఓ గుహలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత ప్రాచీన గుడి ఉంది. ఆ తర్వాత భారీ పద్మనాభస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ గుడి ముందు ధ్యానం చేస్తున్న రుషిపై పాములు ఎక్కుతాయి. రుషి కళ్లు తెరుస్తారు. ఆ తర్వాత నాగబంధం వేసిన ఓ తలుపు కనపిస్తుంది. నిధికి ఉన్న తలుపుకు నాగబంధం వేసినట్టుగా కనిపిస్తోంది. నాగబంధం టైటిల్‍కు సీక్రెట్ ట్రెజర్ అనే ట్యాగ్ లైన్ ఉంది. నిధి రహస్యం అంటూ ఈ చిత్రం వస్తోంది. గ్లింప్స్‌లో వీఎఫ్‍ఎక్స్ మంచి క్వాలిటీతో కనిపిస్తోంది. విజువల్స్ గ్రాండ్‍గా ఉన్నాయి.
శాంతాకారం భుజగశయనం శ్లోకంతో ఈ గ్లింప్స్ వీడియోలో బ్యాక్‍గ్రౌండ్ కూడా ఇంటెన్స్‌గా ఉంది. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అభీ మ్యూజిక్ అందిస్తుండగా.. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. మధుసూదన్ రావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఈ టైటిల్ గ్లింప్స్ వీడియోతో నాగబంధం చిత్రంపై ఆసక్తి మరింత పెరగనుంది.
అయితే, నాగబంధం సినిమాలో నటీనటుల గురించి మూవీ టీమ్ వెల్లడించలేదు. ఈ గ్లింప్స్‌తో టెక్నిషియన్లను మాత్రమే వెల్లడించింది. త్వరలోనే నటీనటులు ఎవరనే విషయాలను ప్రకటించే అవకాశం ఉంది.
పద్మనాభ స్వామి ఆలయం గురించి..
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దానికి నాగబంధం ఉందని, అందుకే ఎవరూ తెరవలేకపోతున్నారనే నమ్మకాలు ఉన్నాయి. ఆ నేలమాళిగలో అంతులేని విలువైన సంపద ఉందని, దాని వెనుక రహస్యం దాగుందని ప్రచారం ఉంది. అయితే, గ్లింప్స్ చూశాక ‘నాగబంధం’ సినిమా పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగ గురించే అని అర్థమవుతోంది. దీంతో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మిస్టరీపై ఈ చిత్రంలో ఏం చూపిస్తారోననే క్యూరియాసిటీ తప్పక కలుగుతుంది.
2025లో పాన్ ఇండియా రేంజ్‍లో నాగబంధం విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.