Nithiin: నాకు ఆ సినిమా చాలా ఇష్టం.. కానీ అనుకున్నంత హిట్ కాలేదు.. ఇప్పుడైతే..: హీరో నితిన్
Nithiin: నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ నుంచి మరో పాట ప్రోమో రిలీజ్ అయింది. దీని కోసం జరిగిన ప్రోమో లాంచ్ ఈవెంట్‍లో హీరో నితిన్ మాట్లాడారు.
Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎక్స్‌ట్రా - ఆర్జినరీ మ్యాన్’ సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. డిసెంబర్ 8వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రం నుంచి “ఓలే ఓలే పాపాయి” పాట ప్రోమో నేడు వచ్చింది. ఈ సాంగ్ ప్రోమో లాంచ్ ఈవెంట్‍కు హీరో నితిన్ హాజరయ్యారు. మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన సినిమాల్లో ఇష్టమైనది ఏదనే ప్రశ్న నితిన్‍కు ఎదురైంది. దీనికి ఆయన సమాధానం చెప్పారు. శ్రీఆంజనేయం సినిమా తనకు చాలా ఇష్టమని నితిన్ చెప్పారు. అయితే, ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని అన్నారు. ఇప్పుడున్న గ్రాఫిక్స్‌తో ఆ చిత్రం చేస్తే చాలా పెద్ద రేంజ్ మూవీ అవుతుందని చెప్పారు.
“నేను మాలలో ఉన్నానని కాదు. కానీ నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీఆంజనేయం. దాంట్లో రెండు, మూడు చిన్నచిన్న లోపాల వల్ల ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడున్న టైమ్‍లో సీజీ వర్క్ లాంటి వాటితో ఆ సినిమా రీమేక్ చేస్తే.. చాలా పెద్ద రేంజ్ మూవీ అవుతుంది. నేను మళ్లీ అలాంటి ఒక అమాయకపు క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్” అని నితిన్ చెప్పారు. నితిన్ ప్రస్తుతం అంజనేయ మాల ధరించారు. కాగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన శ్రీఆంజనేయం మూవీ 2004లో రిలీజ్ అయింది. అయితే, అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ చిత్రంలో ఆంజనేయుడిగా అర్జున్ నటించారు.
హీరోయిన్ శ్రీలీల డేట్స్ దొరకడం తమకు ఛాలెంజింగ్‍గా ఉందని నితిన్ అన్నారు. ఆమె ప్రమోషన్లకు వస్తుందా.. లేదా అన్న టెన్షన్ కూడా ఉందని చెప్పారు.
ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ సినిమా నుంచి మాస్ బీట్‍తో ఉన్న “ఓలే ఓలే పాపాయి” సాంగ్ ప్రోమో నేడు లాంచ్ అయింది. నితిన్, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయింది. పూర్తి పాట డిసెంబర్ 4న రానుంది. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.
ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. చాలా సూపర్ హిట్ సినిమాకు కథలు అందించిన వంశీకి దర్శకుడిగా ఇది రెండో మూవీ. ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఉంది. పంచ్‍లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.