Paradise Review: ప్యారడైజ్ రివ్యూ - మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Paradise Review: రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం మూవీ ప్యారడైజ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
Paradise Review: దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రజెంటర్‌గా వ్యవహరించిన మలయాళం మూవీ ప్యారడైజ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. దర్శనరాజేంద్రన్, రోషన్ మాథ్యూ జంటగా నటించిన ఈ మూవీకి శ్రీలంకకు చెందిన ప్రసన్న వితాంగే దర్శకత్వం వహించాడు. సర్వైవల్ డ్రామా కథాంశంతో రూపొందిన ఈమూవీ ఎలా ఉందంటే?
రామాయణ టూర్…
కేశవ్ (రోషన్ మాథ్యూ) ఓ ఫిల్మ్ మేకర్. తన ఐదో పెళ్లి రోజు సందర్భంగా భార్య అమృతతో (దర్శనా రాజేంద్రన్) కలిసి రామాయణ టూర్ కోసం శ్రీలంకకు వస్తాడు. వారికి ఆండ్రూ గైడ్‌గా ఉంటాడు. అడవికి సమీపంలో ఉండే ఓ రిసార్ట్‌లో దిగుతారు కేశవ్, అమృత. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు కేశవ్, అమృత రూమ్‌లోకి చొరబడి లాప్‌టాప్, ఫోన్లు ఎత్తుకుపోతారు. కేశవ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు.
రిసార్ట్ దగ్గరి ఊరిలోని కొందరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో గాయపడిన ఓ అనుమానితుడు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోతాడు. పోలీస్ స్టేషన్‌పై ఊరి జనాలు ఎటాక్ చేస్తారు. కేశవ్, అమృతలను కూడా చంపడానికి ప్రయత్నిస్తారు.
ఈ ప్రమాదం నుంచి అమృత, కేశవ్ ప్రాణాలతో బయటపడ్డారా? ఈ ట్రిప్ భార్యభర్తల మధ్య దూరాన్ని ఎలా పెంచింది? అమృత జీవితంలో ఎలాంటి విషాదం ఎదురైంది? అన్నదే ప్యారడైజ్ మూవీ కథ.
శ్రీలంక సంక్షోభం...
ప్యారడైజ్ 2022 లో తలెత్తిన శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రూపొందిన సర్వైవల్ డ్రామా మూవీ. సంక్షోభం సమయంలో విహారయాత్ర కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన ఓ భార్యభర్తలకు ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయనే కథాంశంతో దర్శకుడు ప్రసన్న వితాంగే ఈ మూవీని తెరకెక్కించాడు. జీవితంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే విధి మరోటి తలుస్తుందని అంటుంటారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించిన ఓ జంట తమ ప్రేమయం లేకుండానే ఎలా చిక్కుల్లో పడ్డారు? కొన్ని సార్లు ఆవేశంతో, అనాలోచితంగా చేసే పనులు ఎలాంటి ఇబ్బందులను తేస్తాయన్నది నాచురాలిటీకి దగ్గరగా సినిమాలో చూపించారు దర్శకుడు.
సామాన్యుల జీవితాలు...
మరోవైపు ఆర్థిక సంక్షోభం టైమ్‌లో కరెంట్, ఆక్సిజన్, గ్యాస్ వంటి అత్యవసర సదుపాయాలు అందుబాటులో లేక శ్రీలంకలోని సామాన్య జనం ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు ఎలా చెలగాటమాడాయన్నది అంతర్లీనంగా ఆవిష్కరించారు.
జైలు పాలైన అనుమానితుడు హాస్సిటల్‌లో కన్నుమూశాడని తెలిసిన టైమ్‌లో వచ్చే డైలాగ్స్ శ్రీలంక ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు అద్ధంపట్టాయి. ఓ సామాన్యుడు చనిపోతే ఓ ఓటు కోల్పోవడం తప్ప దేశానికి వచ్చే నష్టం ఏమి లేదని పోలీస్ ఆఫీసర్ చెప్పే డైలాగ్ ఆలోచనను రేకెత్తిస్తుంది.
భార్యభర్తల రిలేషన్...
ఈ సర్వైవల్ డ్రామాలో భార్యభర్తల మధ్య రిలేషన్‌షిప్ ప్రజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. కళ్ల ముందు భూతల స్వర్గంలాంటి అందాలు కనిపిస్తోన్న పోయిన వస్తువుల్ని తలుచుకుంటూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించలేని భర్త, గతాన్ని పక్కనపెట్టి వర్తమానంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలనే భార్య వారి మధ్య ఎదురయ్యే అలకల్ని, అభిప్రాయభేదాల్ని నాచురల్‌గా తెరకెక్కించారు. క్లైమాక్స్ సీన్ ఎమోషనల్‌గా సాగుతుంది.
రెగ్యులర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్‌లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ పారడైజ్‌లో కనిపించవు. కంప్లీట్ ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా సాగుతుంది. విజువల్స్, యాక్టింగ్, స్క్రీన్‌ప్లే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అదే సినిమాకు ప్లస్‌తో పాటు మైనస్‌గా అనిపిస్తుంది.
అమృత పాత్రలో...
ప్యారడైజ్ సినిమా చాలా వరకు హీరోహీరోయిన్ల పాత్రల చుట్టే సాగుతుంది. అమృత పాత్రలో దర్శనరాజేంద్రన్ ఒదిగిపోయింది. మంచితనం, దయాగుణం కలబోసిన సగటు భార్య పాత్రకు న్యాయం చేసింది. ఆవేశపరుడైన భర్తగా రోషన్ మాథ్యూ నటన బాగుంది. శ్యామ్ ఫెర్నాండో నిజమైన గైడ్‌గా... మహేంద్ర పెరారా పోలీస్‌గానే అనిపిస్తారు. అంతలా వారి నటన సహజంగా ఉంది.
ఆర్ట్ మూవీ లవర్స్‌కు మాత్రమే...
ప్యారడైజ్ చక్కటి మెసేజ్‌తో కూడిన సర్వైవల్ డ్రామా మూవీ. మణిరత్నం టైప్ క్లాసిక్, ఆర్ట్ సినిమా లవర్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది.