LIC Movie: వారంలోగా సినిమా టైటిల్ మార్చండి: నయనతార భర్త మూవీకి ప్రభుత్వ సంస్థ వార్నింగ్: కారణమిదే-life insurance corporation issued notice to vignesh shivan lic movie team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lic Movie: వారంలోగా సినిమా టైటిల్ మార్చండి: నయనతార భర్త మూవీకి ప్రభుత్వ సంస్థ వార్నింగ్: కారణమిదే

LIC Movie: వారంలోగా సినిమా టైటిల్ మార్చండి: నయనతార భర్త మూవీకి ప్రభుత్వ సంస్థ వార్నింగ్: కారణమిదే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 09, 2024 06:35 PM IST

LIC Movie: తమిళ మూవీ ఎల్‍ఐసీ డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్‍కు నోటీసులు జారీ అయ్యాయి. సినిమా టైటిల్‍ను వారంలోగా మార్చాలని ఆయనకు సూచనలు అందాయి. వివరాలివే..

ఎల్‍ఐసీ మూవీ టీమ్
ఎల్‍ఐసీ మూవీ టీమ్

LIC Movie: లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళంలో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. స్టార్ హీరోయిన్ నయనతార భర్త, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు హీరోయిన్, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‍గా చేస్తున్నారు. అయితే, ఈ ఎల్ఐసీ చిత్రానికి ఆటంకం ఎదురైంది.

ఈ చిత్రానికి ఎల్‍ఐసీ టైటిల్‍ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీ టైటిల్.. తమ సంస్థ పేరును గుర్తుచేసేలా ఉందని తెలిపింది. ఈ మేరకు టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‍కు లీగల్ నోటీసులను ఎల్ఐసీ పంపిందని సినిమా ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.

ఎల్‍ఐసీ సినిమా టైటిల్‍ను ఏడు రోజుల్లోగా మార్చాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని విఘ్నేశ్‍తో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‍కు కూడా ఎల్‍ఐసీ సంస్థ నోటీసులు జారీ చేసిందట. ఒకవేళ మూవీ పేరు చేంజ్ చేయకపోతే న్యాయపరమైన చర్యలు ఎల్ఐసీ హెచ్చరించినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది.

కొన్ని దశాబ్దాల నుంచి జీవిత బీమా సేవలను అందిస్తున్న ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)’ దేశంలో అత్యున్నత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. చాలా పాపులర్ అయింది. దీంతో తమ సంస్థ పేరును వాడుకోవటంపై మూవీ యూనిట్‍ను హెచ్చరించింది. అయితే, ఎల్‍ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు.

ఎల్‍ఐసీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు ఎస్‍జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. గతంలో హీరో శివకార్తికేయన్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని విఘ్నేశ్ భావించారు. అయితే, అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ప్రదీప్‍తో ఈ చిత్రం చేస్తున్నారు. ఎల్ఐసీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నయనతార సినిమాపై ఎఫ్‍ఐఆర్

నయనతార ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణి సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం గత డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. అయితే, అన్నపూర్ణి సినిమా మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఉందని.. తాజాగా ఎఫ్‍ఐఆర్ నమోదైంది.

అన్నపూర్ణి సినిమా లవ్ జిహాద్‍ను ప్రోత్సహించేలా, మత విశ్వాసాలను కించపరిచేలా ఉందంటూ రమేశ్ సోలంకి అనే ముంబైకు చెందిన వ్యక్తి కేసు నమోదు చేశారు. నయనతారతో పాటు జై, డైరెక్టర్ నీలేశ్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేతి, ఆర్ రవిచంద్రన్‍తో పాటు నెట్‍ఫ్లిక్స్ ఇండియా హెడ్‍ను పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారు. అన్నపూర్ణి సినిమాలో చెఫ్‍గా నయనతార నటించారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Whats_app_banner