Life Stories Review: లైఫ్ స్టోరీస్ రివ్యూ - లేటెస్ట్ తెలుగు అంథాలజీ మూవీ ఎలా ఉందంటే?
Life Stories Review: ఆరు కథలతో తెలుగులో రూపొందిన అంథాలజీ మూవీ లైఫ్ స్టోరీస్ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దేవయాని శర్మ, షాలిని కొండేపూడి కీలక పాత్రల్లో కనిపించారు.
Life Stories Review: దేవయాని శర్మ, షాలిని కొండేపూడి, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన అంథాలజీ మూవీ లైఫ్ స్టోరీస్. ఆరు కథలతో తెరకెక్కిన ఈ తెలుగు అంథాలజీ మూవీకి ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. శనివారం థియేటర్లలో రిలీజైన ఈ అంథాలజీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అంటే
ఆరు కథల సమాహారం...
లైఫ్ స్టోరీస్ ఆరు కథలతో తెరకెక్కిన అంథాలజీ మూవీ. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఆ కారులో కొన్ని ఇంజినీరింగ్ బుక్స్ కనిపిస్తాయి. కారు డ్రైవర్ ఇంజినీరింగ్ పూర్తిచేయడమే కాకుండా కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా చేసి మానేశాడని తెలుస్తుంది. క్యాడ్ డ్రైవర్‌గా మారిన తర్వాతే ఆనందం అంటే ఏమిటో తెలిసిందని అంటాడు. క్యాడ్ డ్రైవర్‌కు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి మధ్య జరిగిన సంభాషణను క్యాబ్ క్రానికల్స్ కథలో దర్శకుడు చూపించాడు.
తన తల్లితో (దేవయానిశర్మ) కలిసి సంతోషంగా గడపాలని ఓ చిన్నారి కలలు కంటాడు. కానీ ఉద్యోగబాధ్యతల కారణంగా కొడుకు చిన్న చిన్న ఆనందాలకు కూడా సమయం కేటాయించలేకపోతుంది ఆ తల్లి. కొడుకు ఆనందం కోసం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది మామ్ మీ కథలో హృద్యంగా దర్శకుడు ఆవిష్కరించాడు.
సతీష్, మంగేష్ జ్ఞాపకాలు...
సతీష్ తన భార్యతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి రిసార్ట్‌కు వెళతాడు. అక్కడ అతడి స్కూల్ ఫ్రెండ్ మంగేష్ కనబడతాడు. తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని వారు ఎలా నెమరు వేసుకున్నారు? వారి భార్యల మధ్య సాగిన డిస్కషన్స్ ఏమిటన్నది గ్లాస్‌మేట్స్ కథలో సరదాగా ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ పీయూష్ (సత్య) తన లవర్ హారికతో కలిసి న్యూయర్ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. చివరి నిమిషంలో అతడి ప్లాన్ ఎలా రివర్సైందన్నది? ఒంటరిగా అతడు వికారాబాద్ ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నది జిందగీ కథలో ఎమోషనల్‌గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్.
మంగమ్మ (లక్ష్మి సుంకర) రోడ్ పక్కన చిన్న టీ స్టాల్ నడుపుతుంటుంది. ఎవరూ లేని ఆమె జీవితంలోకి ఓ కుక్క ఎలా వచ్చింది? బంగారం అని ఆ కుక్కకు మంగమ్మ ఎందుకు పేరు పెట్టింది? బంగారంతో మంగమ్మకు ఏర్పడిన అనుబంధాన్ని బంగారం కథలో దర్శకుడు చూపించాడు.
శ్రేయా (షాలిని కొండేపూడి) తన భర్తతో కలిసి న్యూ ఇయర్ రోజున పార్టీ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బాస్ అర్జెంట్ వర్క్ ఇవ్వడంతో ఆఫీస్‌లోనే ఉండిపోవాల్సివస్తుంది. భర్తతో పార్టీ చేసుకోవాలనే ఆమె కల ఎలా తీరిందన్నది వైల్డ్ హట్స్ కథలో సింపుల్ ఎమోషన్స్‌తో చెప్పారు దర్శకుడు.
అంథాలజీ మూవీ...
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో అంథాలజీ సినిమాల ట్రెండ్ తక్కువే. కేరాఫ్ కంచెరపాలెం, చందమామకథలు, పంచతంత్రం లాంటి అంథాలజీ మూవీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో వచ్చిన అంథాలజీ మూవీ లైఫ్ స్టోరీస్. ఇదివరకు తెలుగులో వచ్చిన అంథాలజీ మూవీస్‌కు భిన్నంగా లైఫ్ స్టోరీస్ సాగుతుంది. న్యూ ఇయర్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఆరు కథల్ని అల్లుకున్నారు. డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌తో జరిగే ఆరు కథల్ని ముడిపెట్టిన విధానం బాగుంది.
నిజజీవితాల నుంచే స్ఫూర్తి పొందుతూ ప్రతి కథను దర్శకుడు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. వాటిని స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన విధానం కూడా నాచురల్‌గా ఉంది.
ఉరుకులు పరుగుల జీవితాల్లో పిల్లల కోసం టైమ్ కేటాయించలేక తల్లిదండ్రులు పడే ఆవేదనను, చిన్న చిన్న సంతోషాలకు దూరమై పడే బాధను హృద్యంగా చూపించారు. కలల విషయంలో కొందరు రాజీపడి ఎలా బతుకుతారు? ఇలా ఒక్కో కథతో ఒక్కో ఎమోషన్‌ను చూపించారు. నవ్విస్తూనే ప్రతి కథ ఆలోచింపజేస్తుంది. క్లైమాక్స్‌ను చిన్న సర్‌ప్రైజ్‌తో ఎండ్ చేయడం బాగుంది.
అదే మైనస్...
ఆరు కథలు నిడివి తక్కువే అయినా కొన్నిచోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని కథల్లోని భావోద్వేగాలు అంతగా వర్కవుట్ కాలేదు. పూర్తిగా మల్టీప్లెక్స్ ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్లుగా ఈ సినిమా సాగుతుంది.
మంగమ్మ పాత్రలో...
అంథాలజీ మూవీలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. మంగమ్మ పాత్రలో కనిపించిన లక్ష్మి సుంకర నటన ఆకట్టుకుంటుంది. కొడుకు సంతోషం కోసం ఆరాటపడే తల్లిగా దేవయాని శర్మ , ఉద్యోగబాధ్యతల కారణంగా చిన్న చిన్న సంతోషాలకు దూరమయ్యే సగటు ఇల్లాలిగా షాలిని కొండేపూడి సింపుల్ యాక్టింగ్‌తో మెప్పించారు. ప్రదీప్ రాపర్తి, సత్య కేతినీడితో పాటు మిగిలిన వాళ్ల నటన బాగుంది. విన్ను మ్యూజిక్ కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేసింది.
రియలిస్టిక్ మూవీ...
లైఫ్ స్టోరీస్ రియలిస్టిక్ సినిమా లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుంది.
రేటింగ్: 2.75/5