Krishna mukunda murari serial january 29th: అసలు నిజం తెలుసుకునేందుకు మధు తిప్పలు.. ఆందోళనలో భవానీ
Krishna mukunda murari serial january 29th episode: ముకుంద పూర్తిగా మారిపోయిందని ఆదర్శ్ నమ్ముతాడు. కానీ భవానీ మాత్రం ముకుంద మనసులో ఏముందోనని కంగారు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial january 29th episode: భవానీ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన ప్రవర్తన చూస్తుంటే అంగీకరించినదని అసలు నమ్మకం కలగడం లేదు. తన అన్న చేసిన పనులు తనకి తెలియకుండా ఉంటాయా? ముకుంద సపోర్ట్ లేకుండా తన అన్న అంతకి తెగిస్తాడా? అప్పుడే ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నా కానీ ఈ కృష్ణ అడ్డుపడింది. ఈ కృష్ణ తన అతిమంచితనంతో తన గురించి ఆలోచించడం మానేసింది. తను మారిపోయిందని గుడ్డిగా నమ్మి ఆదర్శ్ ని తీసుకొచ్చింది. అసలు ఏం చెప్పి ఆదర్శ్ ని తీసుకొచ్చింది.
ముకుంద మనసులో ఏముందోనని టెన్షన్ పడుతున్న భవానీ
ఒక పక్క బిడ్డ వచ్చాడని సంతోషంగా ఉన్న మరోపక్క ఎక్కడ తన మనసు చంపేస్తుందోనని భయంగా ఉంది. అసలు ముకుంద మనసులో ఏముందో క్లియర్ గా తెలియడం లేదని ఆలోచిస్తూ ఉండగా రేవతి వచ్చి వేరే పంతుల్ని పిలిపిద్దామా అని అడుగుతుంది. ఎందుకని భవానీ అంటే ఫోన్లో రెండు మూడు రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయన్న పంతులు ఇప్పుడు పది రోజుల వరకు లేవని అంటున్నారు. సరిగా చూశారో లేదో వేరే పంతుల్ని పిలిచి అడుగుదామని అంటుంది. అయినా పది రోజులే కదా ఇన్నాళ్ళూ ఆగిన వాళ్ళం పది రోజులు ఆగలేమా అంటే ఆగుతాము కానీ నేను మీ గురించే ఆలోచిస్తున్నానని రేవతి చెప్తుంది.
ఆదర్శ్ వచ్చినప్పుడు మీ మొహంలో సంతోషం చూశాను. కానీ పంతులు ఎప్పుడైతే ముహూర్తాలు లేవని చెప్పాడో అప్పుడు మీ మొహంలో సంతోషం తగ్గిందని రేవతి అంటుంది. పంతులికి ముహూర్తాలు లేవని చెప్పమని చెప్పింది నేనే. అది నా సంతోషాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదర్శ్ ని తీసుకొస్తానని అంటే ముకుంద ఎందుకు ఒప్పుకుందో తెలియదు. తన మనసులో ఏముందో తెలియదు. అవన్నీ బయట పడాలంటే కొంచెం టైమ్ అవసరమని భవానీ మనసులో అనుకుంటుంది. ముకుంద మారిపోయింది ఆదర్శ్ తిరిగి వచ్చాడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే కృష్ణ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని రేవతి తన మనసులో ఫీలింగ్ చెప్తుంది.
నేను తాకానని ముకుంద అరిచిందా
కృష్ణ, మురారి ఆదర్శ్ ని తీసుకురావడం కరెక్టే అంటావా అని భవానీ రేవతిని అడుగుతుంది. ఆదర్శ్ రావడం వల్లే కదా మనం సంతోషంగా ఉన్నాం లేదంటే ముకుంద ఆదర్శ్ చెరొక చోట ఉండి బాధపడుతూ ఉంటారు. కృష్ణ వాళ్ళు ఒకే చోట ఉండి కూడా దూరంగా ఉండే వాళ్ళు. అయినా మీకెందుకు ఈ అనుమానం వచ్చిందని రేవతి అడుగుతుంది. అనుమానం ఏమి కాదు కృష్ణ వాళ్ళు తీసుకురాకుండా ఆదర్శ్ స్వయంగా తనంతట తనే వచ్చి ఉంటే బాగుండేదని అంటుంది. వీళ్ళు వెళ్లబట్టే కదా ముకుంద మారిందని ఆదర్శ్ కి తెలిసిందని రేవతి చెప్తుంది.
ముకుంద మారినట్టు అక్క నమ్మడం లేదు మళ్ళీ ఏం జరుగుతుందోనని భయపడుతున్నట్టు ఉందని రేవతి మనసులో అనుకుంటుంది. నిజంగా నాకు భయమేస్తుంది రేవతి. పొరపాటున ముకుంద ఆదర్శ్ ని అంగీకరించకపోతే నా బిడ్డ ఏమైపోతాడా అని భయంగా ఉందని భవానీ భయపడుతుంది. ఆదర్శ్ కూడా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుంద నిజంగానే భయపడి అరిచిందా లేదంటే నేను తాకడం ఇష్టం లేక అరిచిందా? లేదంటే అప్పుడు నేను చెప్పకుండా వెళ్లానని కోపంగా ఉందా? కోపం ఉంటే నన్ను తీసుకుని రమ్మని మురారి వాళ్ళకి ఎందుకు చెప్తుంది. నేను అంటే ఇష్టం ఉండబట్టే కదా నన్ను పిలిపించింది. ఆ విషయంలో డౌట్ అక్కర్లేదు. సడెన్ గా చెయ్యి వేసేసరికి భయపడిందని ఆదర్శ్ అనుకుంటాడు.
ముకుంద, ఆదర్శ్ మీద డౌట్ పడిన మధుకర్
ఆదర్శ్ ఒంటరిగా ఉండటం చూసి మధు అసలు ముకుంద బ్రోని అంగీకరించిందా? అసలు నిజంగా తొండ పడిందా లేదంటే ఏదైనా ఉందా? ఇందాక బ్రో కూడా ముకుంద మాట చెప్పాడు కదా ఇప్పుడు తనతో ఎలాగైనా నిజం చెప్పించాలి. మందు వేస్తే ఎలాగైనా నిజం బయటకి వచ్చేస్తుందని మధు ప్లాన్ చేస్తాడు. మందు బాటిల్ తీసుకొచ్చి సిట్టింగ్ వేద్దామని ఆదర్శ్ ని బలవంతంగా తీసుకుని వెళతాడు.
ఆదర్శ్ ని కూర్చోబెట్టి ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు చెప్పమని అంటాడు. కానీ తనకి ప్రాబ్లమ్స్ ఏమి లేవని చెప్తాడు. తొండ వేరు ఊసరవెల్లి వేర్వేరా అని మధు అడుగుతాడు. ఇక డైరెక్ట్ గా ముకుంద మీద తొండ నిజంగానే పడిందా అంటాడు. ఆదర్శ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సుమలత వచ్చి పొద్దున్నే మందు తాగుతావా అని నాలుగు తగిలిస్తుంది.
కృష్ణని తింగరిదాన్ని చేయాలనుకున్న మురారి
ముకుంద నన్ను మర్చిపోయి ఆదర్శ్ ని అంగీకరించింది. ఆదర్శ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అందుకే కలిసి మందు తాగుదాం రమ్మని పిలిచాడు. దీనికి కారణం కృష్ణ తన సంతోషం కంటే వాళ్ళ సంతోషం కోసం ఆరాటపడింది ఇక తను ఏం చెప్తే అదే చేస్తానని మనసులో అనుకుంటాడు. కృష్ణ వచ్చి ఏం చేస్తున్నారని అడిగితే నీ గురించే ఆలోచిస్తున్నానని చెప్తాడు. తనని తింగరి దాన్ని చేసి ఎలాగైనా తాగడానికి ఒప్పించాలని అనుకుంటాడు. మురారి తిక్కతిక్కగా మాట్లాడుతుంటే ఆదర్శ్ మందుకి పిలిచాడు అనేసరికి మురారి బిత్తరపోతాడు. అమ్మో ఇది తింగరిది కాదు మహా తెలివైనదని అనుకుంటాడు. మనసులో విషయం కనిపెట్టేశావ్ కదా ప్లీజ్ వెళ్లనివ్వమని బతిమలాడుకుంటాడు. సరే పీపాలు పీపాలు తాగొద్దని చెప్తుంది. సంతోషంగా కృష్ణకి ముద్దు పెట్టేసి వెళతాడు.
మురారి, ఆదర్శ్ కూర్చుని మందు కొడుతూ ఉంటారు. మధు వచ్చి ఇక్కడ సిట్టింగ్ వేసిన విషయం కృష్ణకి తెలుసా అని అడుగుతాడు. తెలిస్తే ఏమవుతుందని మురారి అంటాడు. మురారిని పంపించి ఆదర్శ్ ని తొండ గురించి అడగాలని మధు అనుకుంటాడు. ప్రసాద్ కూడా వచ్చి సిట్టింగ్ లో కూర్చుంటాడు. మధు ప్రసాద్ ని కావలని రెచ్చగొడతాడు.