Karthi Pasalapoodi Veera Babu Movie Review: కార్తి పసలపూడి వీరబాబు మూవీ రివ్యూ
Karthi Pasalapoodi Veera Babu Movie Review: కార్తి, అదితి శంకర్ జంటగా నటించిన సినిమా పసలపూడి వీరబాబు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Karthi Pasalapoodi Veera Babu Movie Review: కొత్తదనాన్ని నమ్మి సినిమాలు చేయడంలో ముందువరుసలో ఉంటాడు హీరో కార్తి. కథలను ఎంచుకునే విధానమే తమిళంతో పాటు తెలుగులో కార్తికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అవారా, ఖైదీ తో పాటు అతడు నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి.
కార్తి నటించిన తాజా తమిళ చిత్రం విరుమన్. ఈ సినిమా పసలపూడి వీరబాబు పేరుతో తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహించాడు. తమిళ అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ (Adithi shankar) ఈ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...
తండ్రీకొడుకుల పోరాటం...
పసలపూడికి చెందిన వీరబాబు(కార్తి) చిన్ననాటి నుంచి తండ్రి భూపతి(ప్రకాష్ రాజ్)ని ద్వేషిస్తుంటాడు. తల్లి మహాలక్ష్మి (శరణ్య) చావుకు తండ్రి కారణం కావడంతో అతడితో ఎప్పుడూ గొడవపడుతుంటాడు. తండ్రికి దూరంగా మామయ్య సత్యమూర్తి (రాజ్‌కిరణ్) దగ్గర పెరుగుతాడు. వీరబాబు ముగ్గురు అన్నలు మాత్రం తండ్రి దగ్గరే పెరుగుతారు. తల్లికి ఇచ్చిన మాట కోసం అన్నయ్యలు ఎంత అవమానించినా వారిని పల్లెత్తు మాట కూడ అనడు వీరబాబు.
తండ్రి అహం, పొగరు కారణంగా అన్నయ్యలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన వీరబాబు వారి జీవితాల్ని ఎలా చక్కదిద్దాడు? తండ్రిలో ఎలా మార్పు తీసుకొచ్చాడు? తండ్రి కొడుకుల పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? తండ్రినని వీరబాబు ద్వేషించడానికి కారణమేమిటి? మరదలు రేణుకతో(అదితి శంకర్) ప్రేమలో పడిన వీరబాబు ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్(Karthi Pasalapoodi Veera Babu Movie Review)
మాస్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. పొగరుబోతు తండ్రికి, మంచి మనసున్న కొడుకుకు మధ్య జరిగే పోరాటం చుట్టూ కుటుంబ బంధాలను అల్లుకుంటూ దర్శకుడు ముత్తయ్య ఈ కథను రాసుకున్నాడు. కొడుకుల్ని అనుక్షణం ద్వేషించే ఓ తండ్రి, తండ్రి మాట జవదాటని కొడుకులు వారిలో మార్పు తీసుకురావడానికి ఓ తమ్ముడు పడే ఆరాటంతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది.
బావమరదళ్ల లవ్‌స్టోరీ...
తండ్రిని చంపడానికి కొడుకు ప్రయత్నించే ఫస్ట్ సీన్‌తోనే పసలపూడి వీరబాబు సినిమా మెయిన్ పాయింట్ ఏమిటో చెప్పేశాడు దర్శకుడు. ఆరంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌లో తాహశీల్దార్ అయిన తండ్రి చేసే పనులను కొడుకు వీరబాబు ఎదురించే సీన్స్‌తో కథను నడిపించారు. తండ్రి వేసిన ప్రతి ఎత్తును తన తెలివితేటలతో వీరబాబు చిత్తు చేసే మలుపులతో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో బావమరదళ్ల లవ్ స్టోరీతో పాటు రివేంజ్ డ్రామాను జోడించాడు.
తమిళ నేటివిటీ...
పసలపూడి వీరబాబు కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా పాతది. ఈ కథతో చాలా సినిమాలొచ్చాయి. భూపతి పొగరుకు కారణమేమిటన్నది సరిగా చూపించలేదు. తన అన్నయ్యల్లో మార్పు తీసుకురావడానికి వీరబాబు చేసే త్యాగాలు రొటీన్‌గా ఉంటాయి. లవ్‌స్టోరీ కొత్తదనం కరువైంది. కేవలం సినిమా నిడివి పెంచడానికే సినిమాలో ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రధాన పాత్రల గెటప్, లుక్స్, సినిమా లొకేషన్స్ అన్ని తమిళ నేటివిటీలోనే కనిపిస్తాయి. పూర్తిగా తమిళ వాసనలతోనే సినిమా సాగుతుంది.
కార్తి, ప్రకాష్‌రాజ్ పోటాపోటీ(Karthi Pasalapoodi Veera Babu Movie Review)
తండ్రిని ద్వేషిస్తూ అన్నయ్యల బాగు కోసం తపించే వీరబాబు అనే యువకుడిగా కార్తి నటన బాగుంది. ఎమోషన్స్, కామెడీ మేళవించిన మాస్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి. పొగరుబోతు తండ్రిగా ప్రకాష్‌రాజ్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రకు ప్రాణంపోశాడు. అతడి డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అలరిస్తాయి.
కార్తి, ప్రకాష్‌రాజ్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. హీరోయిన్‌గా అదితి శంకర్‌కు ఇదే మొదటి సినిమా. ఢీగ్లామర్ పాత్రలో కనిపించింది. రాజ్‌కిరణ్, ఆర్‌కే సురేష్, వడివుక్కరసి కీలక పాత్రల్లో కనిపించారు. సూరి కామెడీ అక్కడక్కడ పర్వాలేదనిస్తుంది.
కార్తి ఫ్యాన్స్‌కు మాత్రమే..
కొత్తదనం కరువైన రొటీన్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. కార్తి కోసం ఓ సారి పసలపూడి వీరబాబు చూసేయచ్చు.
రేటింగ్: 2.5/5