Siddharth: ‘ప్రభాస్‍తో పోటీ పడాలని డిసైడ్ అయ్యా.. కానీ’: హీరో సిద్ధార్థ్
Siddharth: సిద్ధార్థ్ హీరోగా నటించిన చిన్నా సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా ప్రెస్‍మీట్‍లో పలు విషయాలపై సిద్ధార్థ్ మాట్లాడారు.
Siddharth: హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించిన ‘చిత్త’ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి సినిమాగా ప్రశంసలు పొందుతోంది. తమిళంలో సెప్టెంబర్ 28న రిలీజైన ఈ చిత్రానికి చాలా శాతం రివ్యూలు పాజిటివ్‍గా వచ్చాయి. ఈ చిత్రం గొప్పగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిత్త మూవీ తెలుగులో ‘చిన్నా’ పేరుతో రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 6వ తేదీన చిన్నా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగులో ప్రమోషన్ల కోసం హైదరాబాద్‍లో ప్రెస్‍మీట్ నిర్వహించారు హీరో సిద్ధార్థ్. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి ఎందుకు రిలీజ్ చేయలేదో కారణాన్ని చెప్పారు. అలాగే, తెలుగులో ఇప్పుడు సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని కొందరు అన్నారని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలివే..
తెలుగులో ‘చిన్నా’ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని తాను చాలా రోజుల నిర్ణయించుకున్నానని సిద్ధార్థ్ చెప్పారు. నాలుగు నెలల కిందటే సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఆ రోజున ప్రభాస్ నటించిన సలార్ సినిమా రానుందని తెలిసినా సరే.. తన మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ప్రభాస్ ‘సలార్’తో పోటీ పడాలని అనుకున్నట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత సలార్ చిత్రం వాయిదా పడటంతో.. ఒకేసారి పది సినిమాలు వచ్చేశాయని అన్నారు.
“ప్రభాస్ నటించిన సలార్‌కు పోటీగా నా చిన్నా సినిమాను కూడా రిలీజ్ చేయాలని 49 రోజుల ముందే నేను నిర్ణయించుకున్నా. నాలుగు నెలల కిందటే అన్ని భాషల్లో సెన్సార్ చేయించా. అందుకే సలార్‌కు పోటీ అయినా నా సినిమాను తెలుగులోనూ అదే రోజు రిలీజ్ చేయాలనుకున్నా. ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్‍నే. సలార్ ఫస్ట్ షో చూస్తా.. దాని తర్వాత నా సినిమా చూసుకుంటా కదా. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ప్రాబ్లం ఏంటని అనుకున్నా. బడ్జెట్ పరంగా సలార్ మీకు పెద్ద సినిమా. చిన్నా నా లైఫ్. నాకు పెద్ద సినిమాయే కదా. అందుకే ప్రభాస్ పెద్ద సినిమాతో పోటీకి పెడతానని రెడీ అయ్యా. కానీ వాళ్లు సలార్ డేట్ మార్చేశారు. ఆ తర్వాత పది మంది ఆ డేట్‍లో వచ్చేశారు” అని సిద్ధార్థ్ చెప్పారు.
ఎన్ని సినిమాలు వచ్చినా సెప్టెంబర్ 28వ తేదీన చిన్నా చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నానని, అయితే డిస్ట్రిబ్యూషన్ కారణాల వల్ల తెలుగులో ఆలస్యమైందని సిద్ధార్థ చెప్పారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అని ఆయన అన్నారు.
“నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అని దర్శకుడు అరుణ్‍కు నేను చెప్పా. సిద్ధార్థ్ అనే మనిషి ఇంకా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టర్‍గా ఉండాలో అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారని అరుణ్‍కు చెప్పా” అని సిద్ధార్థ్ అన్నారు.
సిద్దార్థ్ సినిమా ఎవరుచూస్తారని అన్నారు
“తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారని కొందరు అన్నారు” అని చెబుతూ సిద్ధార్థ్ భావోద్వేగానికి లోనయ్యారు. థియేటర్లు ఇవ్వలేదని చెప్పారు. అయితే, మీతో నేనున్నానంటూ ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ ముందుకు వచ్చి.. చిన్నా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని సిద్ధార్థ్ చెప్పారు. చిన్నా లాంటి మంచి సినిమానే తెలుగులో బాగా ఆడకపోతే.. భవిష్యత్తులో తన చిత్రాలను తెలుగులో విడుదల చేయబోనని సిద్ధార్థ్ చెప్పారు.
చిన్నా సినిమాకు ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పిల్లలపై వేధింపుల అంశంపై ఎమోషనల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది.