Hollywood actors strike: హాలీవుడ్‌కు ఎంత కష్టం వచ్చింది.. యాక్టర్స్ స్ట్రైక్.. మూతపడిన ఇండస్ట్రీ
Hollywood actors strike: హాలీవుడ్‌కు ఎంత కష్టం వచ్చింది? యాక్టర్స్ స్ట్రైక్ చేస్తుండటంతో ఇండస్ట్రీ మూతపడింది. ఈ మధ్యే రైటర్స్ చేసిన స్ట్రైక్ నుంచి కోలుకోకముందే నటీనటులూ సమ్మె బాట పట్టారు.
Hollywood actors strike: ప్రపంచ సినిమాను ఏలే హాలీవుడ్‌కు పెద్ద కష్టమే వచ్చింది. గత 63 ఏళ్లలో ఎన్నడూ చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఆ ఇండస్ట్రీ చూస్తోంది. రచయితలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా గురువారం అర్ధరాత్రి నుంచి వేలాది మంది హాలీవుడ్ నటీనటులు కూడా సమ్మె బాట పట్టారు. దీంతో హాలీవుడ్ మొత్తం మూతపడనుంది.
కుదరని ఒప్పందం
తమ రెమ్యునరేషన్లు పెంచాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలంటూ హాలీవుడ్ కు చెందిన ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.. స్టూడియోలతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఈ గిల్డ్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు కనుక తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ అన్నాడు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి హాలీవుడ్ నటీనటులంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. 1960 తర్వాత ఇలా రైటర్స్, యాక్టర్స్ స్ట్రైక్ చేయడం ఇదే తొలిసారి. ఈ డిమాండ్లతోనే రైటర్స్ గత 11 వారాలుగా సమ్మె చేస్తూనే ఉన్నారు. వాళ్లు డిస్నీ, నెట్‌ఫ్లిక్స్ లాంటి స్టూడియోల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమ్మెతో హాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు, టీవీ సిరీస్ లు చాలా ఆలస్యం కానున్నాయి. ఇదిలాగే కొనసాగితే భారీ సినిమాల రిలీజ్ లు వాయిదా పడటం ఖాయం. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉండనున్నారు. క్రిస్టఫర్ నోలాన్ డైరెక్షన్ లో వస్తున్న ఓపెన్‌హైమర్ మూవీ లండన్ ప్రమోషన్ల నుంచి మూవీ టీమ్ తప్పుకుంది.
లక్షకుపైగా నటీనటుల సమ్మె
ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లో మొత్తం 1.6 లక్షల మంది నటీనటులు ఉన్నారు. వీళ్లలో మెరిల్ స్ట్రీప్, జెన్నిఫర్ లారెన్స్, గ్లెన్ క్లోజ్ లాంటి టాప్ యాక్టర్స్ నుంచి టీవీ సిరీస్ లలో చిన్నచిన్న పాత్రలు వేసే వారికి వరకూ అందరూ ఉన్నారు. చివరిసారి యాక్టర్స్ యూనియన్ 1980లో మూడు నెలలపాటు ఇలా సమ్మె బాట పట్టారు. ఈసారి 98 శాతం మంది నటీనటులు ఈ సమ్మెకు మద్దతు తెలపడం గమనార్హం.
అత్యాశకు పోతున్న స్టూడియోల వల్ల తాము బాధితులం అవుతున్నామని నటీనటులు వాపోతున్నారు. స్టూడియోలు భారీ లాభాలు ఆర్జిస్తూ తమకు ఇవ్వాల్సినంత ఇవ్వడం లేదన్నది ఒక సమస్య కాగా.. క్రియేటివ్ వృత్తులైన రైటర్స్ లాంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పొంచి ఉన్న ముప్పు మరో సమస్య. ఈ రెండింటినీ పరిష్కరించాల్సిందిగా హాలీవుడ్ రైటర్స్, యాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం