HBD Rajinikanth: రజినీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలివే.. ఓ లుక్కేయండి-here some interesting and unknown facts about superstar rajinikanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hbd Rajinikanth: రజినీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలివే.. ఓ లుక్కేయండి

HBD Rajinikanth: రజినీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలివే.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Dec 12, 2022 10:59 AM IST

HBD Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు నేడు. 1950 డిసెంబరు 12న జన్మించిన రజినీ తన కెరీర్‌లో ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నారు. త్వరలో జైలర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో రజినీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్

HBD Rajinikanth: రజినీకాంత్.. ఈ పేరుకు ముందు సూపర్‌స్టార్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ పేరు ఆయన కోసమే పెట్టినట్లుగా సినీ, వ్యక్తిగత జీవితాలతో విశేష ప్రజాదరణ పొందారు. బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు ఆయన అందుకోని గౌరవం లేదు.. చూడని సత్కారం లేదు. అవార్డుల ఆయనకు దాసోహమయ్యాయి. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శివాజి రావ్ గైక్వాడ్ అలియస్ సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. 1950 డిసెంబరు 12న జన్మించిన ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. నటనకు అందంతో పనిలేదని, తన స్టైల్, మేనరిజంతో ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చని నిరూపించిన హీరో రజినీకాంత్. కష్టపడితే ఎలాంటి విజయాలనైనా అందుకోవచ్చని యువతకు స్ఫూర్తి నింపారు. తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న సూపర్‌స్టార్ నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆససక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.

- రజినీకాంత్ చేసిన మొదటి ఉద్యోగం బస్ కండక్టరేనని అందరికీ తెలిసిందే. అయితే ఆ పనిలో ఆయనకు వచ్చిన మొదటి జీతం ఎంతనేది చాలా మందికి తెలియదు. బస్ కండక్టర్‌గా రజినీ జీతం నెలకు రూ.750లు వచ్చేవి. ఆ సంపాదనతోనే తన జీవితాన్ని ప్రారంభించారు మన సూపర్‌స్టార్.

- సూపర్‌స్టార్ గొప్పతనం గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. మీరు గుడిలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని యాచకులుగా భావించి ఎవరైనా వచ్చి చేతిలో రూపాయి పెడితే మీరెలా స్పందిస్తారు? కోప్పడతారు కదూ! కానీ రజినీ మాత్రం అలా చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో నవ్వుతూ వదిలేశారు. ఓ సారి బెంగళూరులోని ఓ దేవాలయంలో రజినీకి ఈ అనుభవం ఎదురైంది.

- రజినీకాంత్ తన కెరీర్‌లో తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల అన్నింటిలోనూ నటించారు. హిందీలో కూడా పలు చిత్రాల్లో మెప్పించారు. ఇది కాకుండా ఓ హాలీవుడ్ చిత్రం, ఓ బెంగాలీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు.

- పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు రజినీకాంతే. సీబీఎస్‌ఈ ఆరోతరగతి పాఠ్యాంశాల్లో 'ప్రమ్ బస్ కండక్టర్ టూ సూపర్‌స్టార్' పేరుతో ఆయన జీవితమే ఓ పాఠంగా విద్యార్థులకు చెబుతున్నారు.

- సూపర్‌స్టార్ రజినీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జపాన్‌లో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆయన చేసిన ముత్తు సినిమా ఇప్పటికీ అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. 2014 మే 5న ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన రజినీని ప్రస్తుతం 6.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్కరోజులోనే 2.5 లక్షల మంది ఫాలోఅయ్యారు.

- రజినీకాంత్ నటనతోనే కాకుండా రచయితగానూ మెప్పించారు. వల్లీ అనే సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. అంతేకాకుండా ఈ సినిమాలో అతిథి పాత్రలోనూ మెరిశారు.

- మణిరత్నం దర్శకత్వంలో రజినీ దళపతి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అప్పుడే అప్‌కమింగ్ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అరవింద్ స్వామి తెలియక రజినీ రూమ్‌కు వెళ్లారు. అక్కడున్న బెడ్‌పై ఆయన నిద్రపోయారు. అయితే రజినీ ఆయనను నిద్రలేపకుండా అదే గదిలో నేలపై పడుకున్నారు. అప్పటికే సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రజినీ.. ఓ అప్‌కమింగ్ హీరోకు ఇచ్చిన గౌరవం ఆయన మంచితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

- రజినీకాంత్‌ను అజాత శత్రువుగా చెప్పుకోవచ్చు. 1996 తమిళనాడు ఎన్నికల సమయంలో రజినీకాంత్ ఓ పార్టీకి మద్దతు తెలిపారు. మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ.. రజినీని అవమానపరుస్తూ మాట్లాడారు. దీంతో ఎన్నికల తర్వాత మనోరమకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న రజినీ.. స్వయంగా కలగజేసుకుని తన అరుణాచలం సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి తనకు శత్రువులు ఎవరూ ఉండరని చెప్పారు.

Whats_app_banner