Emraan Hashmi Rolls Royce: ఇండియాలోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొన్న బాలీవుడ్ నటుడు.. ధరెంతో తెలుసా?
Emraan Hashmi Rolls Royce: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఇండియాలోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. దీని ధర ఏకంగా రూ.12.25 కోట్లు కావడం విశేషం.
Emraan Hashmi Rolls Royce: ఒకప్పుడు బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన నటుడు ఇమ్రాన్ హష్మి.. ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. తమ అత్యంత శక్తివంతమైన మోడల్ గా రోల్స్ రాయిస్ అభివర్ణిస్తున్న ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ కారును అతడు కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర ఇండియాలో రూ.12.25 కోట్లు.
మన దేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఇదే. ఈ మధ్యే టైగర్ 3 మూవీలో విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మి.. తాజాగా ఈ లగ్జరీ కారు కొన్నాడు. తన కొత్త కారులో అతడు వెళ్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు దశాబ్దాల కింద హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మి.. సిల్వర్ స్క్రీన్ పై లిప్ లాక్‌లను చాలా కామన్ గా మార్చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. ఇలా ఏకంగా 44 వేల ఆప్షన్లు ఇవ్వడం విశేషం. దీంతో ఇమ్రాన్ హష్మి కూడా తనకు నచ్చిన ఓ డిఫరెంట్ కలర్, ఇతర కస్టమైజేషన్లతో కారును కొనుగోలు చేశాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును తొలిసారి 11 ఏళ్ల కిందట మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా వచ్చిన ఈ మోడల్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లో నెక్ట్స్ జనరేషన్ గా చెబుతున్నారు.
బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ అయిన రోల్స్ రాయిస్ ప్రస్తుతం ఇండియాలో నాలుగు మోడల్స్ లో తమ కార్లను అమ్ముతోంది. రూ.6.22 కోట్ల నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. వీటిలో ఇమ్రాన్ హష్మి అన్నింటి కంటే ఖరీదైన ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ ను కొనుగోలు చేశాడు.
ఇమ్రాన్ హష్మి గురించి..
ఇమ్రాన్ హష్మి 2003లో ఫుట్‌పాత్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమయ్యాడు. 2004లో మర్డర్, 2005లో జహర్, ఆషిక్ బనాయా ఆప్నే, 2006లో ది కిల్లర్, గ్యాంగ్‌స్టార్ మూవీలతో పాపులర్ అయ్యాడు. మొదటి మూడేళ్లలోనే మంచి హిట్స్ అందించడంతో బాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. గతేడాది సెల్ఫీ, టైగర్ 3 సినిమాల్లో అతడు కనిపించాడు.
ఇమ్రాన్ హష్మి ఇప్పటి వరకూ 40 సినిమాల్లో నటించాడు. ఇక త్వరలోనే తెలుగులో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీలోనూ కనిపించనున్నాడు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్.. విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. తెలుగులో ఇమ్రాన్ కు ఇదే తొలి సినిమా కానుంది.