Eeswarudu Movie Review: ఈశ్వరుడు మూవీ రివ్యూ - శింబు ఫ్యామిలీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Eeswarudu Movie Review: శింబు హీరోగా సుసీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈశ్వరుడు సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.
Eeswarudu Movie Review: కోలీవుడ్‌లో జయాపజయాలకు అతీతంగా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు హీరో శింబు(Simbu). అతడు కథానాయకుడిగా నటించిన తమిళ మూవీ ఈశ్వరన్ తెలుగులో ఈశ్వరుడు పేరుతో అనువాదమైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో రిలీజైంది. నిధి అగర్వాల్(Nidhhi Agerwal), నందితా శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు.ఈశ్వరుడు సినిమా ఎలా ఉందంటే...
Eeswarudu Movie Story -పెదరాయుడు కథ...
పెదరాయుడు (భాగ్యరాజా) భార్య పాపాయి, నలుగురు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ ఊళ్లో అతడు చెప్పిందే వేదం. కుటుంబ జోతిష్యుడు కాళీ (కాళీ వెంకట్) చెప్పిన జాతకం ప్రకారం పాపాయి చనిపోతుంది. ఆ తర్వాత పెదరాయుడే పిల్లలను పెంచి పెద్దచేస్తాడు. వారందరూ సిటీలో సెటిల్ అవుతారు. ఆస్తి గొడవల కారణంగా కొడుకులు, కూతురు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఊర్లోకి రావడం మానేస్తారు.
ఊళ్లో ఉన్న పెదరాయుడి యోగక్షేమాలను ఈశ్వర్ (శింబు) చూస్తుంటాడు. పెదరాయుడు కోరిక మేరకు అతడికుటుంబసభ్యులందరిని ఈశ్వర్ ఊరికి రప్పిస్తాడు. వారి మధ్య గొడవల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు పెదరాయుడు కుటుంబంపై రత్నస్వామి పగపడతాడు. అందరిని చంపాలని చూస్తుంటాడు. అదే సమయంలో పెదరాయుడు ఫ్యామిలీలో మరొకరు చనిపోతారని జోతిష్యుడు హెచ్చరిస్తాడు.
అతడు చెప్పినట్లుగానే జరిగిందా? పెదరాయుడు కుటుంబాన్ని ఈశ్వర్ కంటికి రెప్పలా కాపాడటానికి కారణం ఏమిటి? పెదరాయుడితో అతడికి సంబంధం ఉందా? తాను ప్రాణంగా ప్రేమించిన వాసుకికి (నందితా శ్వేత) ఈశ్వర్ ఎందుకు దూరమయ్యాడు? ఆ తర్వాత అతడి జీవితంలోకి వచ్చిన పూజ (నిధి అగర్వాల్)ఎవరు? రత్నస్వామి బారి నుంచి పెదరాయుడు కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి ఈశ్వర్ ఎలా కాపాడాడు అన్నదే ఈశ్వరుడు(Eeswarudu Movie Review) మూవీ కథ.
ట్రెండ్‌తో సంబంధం లేకుండా…
ట్రెండ్, టైమ్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించే సత్తా ఫ్యామిలీ కథలకు ఉంటుంది. అందుకే ఈ జోనర్‌లో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపుతుంటారు.
దాదాపుగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలు ఒకే ఫార్మెట్‌లో సాగుతుంటాయి. తన కుటుంబానికి ఏర్పడిన సమస్యను పరిష్కరించడం కోసం హీరో చేసే త్యాగాలు, పోరాటాల చుట్టూ ఈ కథల్ని అల్లుకుంటూ సినిమాల్ని తెరకెక్కిస్తోంటారు దర్శకులు. ఈశ్వరుడు కూడా అలాంటి ఓ రొటీన్ కథే.
రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీ...
తండ్రితో పాటు తన సోదరులకు అనుక్షణం అండగా నిలిచే ఓ యువకుడి కథతో దర్శకుడు సుసీంద్రన్ ఈశ్వరుడు సినిమాను తెరకెక్కించారు. ఆ ఫ్యామిలీతో హీరోకు ఉన్న సంబంధం ఏమిటనే ఓ చిన్న ట్విస్ట్‌ను చివరి వరకు రివీల్ కాకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నాడు దర్శకుడు. రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీకి ఓ రివేంజ్ డ్రామా, బావమరదళ్ల ప్రేమకథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు.
డ్రామా కనెక్ట్…
ఫ్యామిలీ కథల్లోని డ్రామాతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. అలాంటి సీన్స్ ఈశ్వరుడులో ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. ఫస్ట్ సీన్ నుంచే ఈ సినిమా చాలా ఆర్టిపీషియల్‌గా సాగుతుంది. శింబు ఇంట్రడక్షన్ సీన్స్ తోనే దర్శకుడి క్రియేటివిటీ ఏం రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.
హీరోకు మినిస్టర్ లెవెల్‌లో పలుకుబడి ఉన్నట్లుగా ఓ రేంజ్ బిల్డ్ ఇచ్చాడు డైరెక్టర్. అతడికి ఏదో పెద్ద ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని ఆడియెన్స్ ఫీలయ్యేలా చేశాడు. చివరకు అతడు గుడికి వచ్చే వీఐపీలకు హెల్ప్ చేసే ఓ యువకుడిగా ప్రజెంట్ చేశాడు. అంతదానికే డీఎస్‌పీ, మినిస్టర్‌లు సైతం హీరో చెప్పినట్లుగా ఎందుకు వింటారో అర్థం కాదు. చెప్పకుంటూ పోతే ఈశ్వరుడులో అలాంటి సెన్స్‌లెన్ సీన్స్ కోకోల్లలుగా కనిపిస్తాయి.
పాత సినిమాల స్ఫూర్తితో...
కుటుంబం కోసం హీరో చేసే త్యాగాలకు సంబంధించి కొత్తగా ఆలోచించడం టైమ్ వేస్ట్ అని డైరెక్టర్ ఫీలయినట్లు ఉన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన పాత సినిమాల్లోని ఒక్కో సీన్ నుంచి లేపేసి ఈశ్వరుడులో పెట్టాడు. హీరోకు పెదరాయుడు ఏమవుతాడన్నది ఇంట్రవెల్‌లో రివీల్ చేసే సీన్‌తోనే క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించేయచ్చు.
పెదరాయుడు కుటుంబంపై రత్నస్వామి, పగపట్టడం, హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కేవలం నిడివి పెంచడానికే ఉపయోగపడ్డాయి. ఇక హీరో లవ్ స్టోరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. హీరో పక్కన ఓ హీరోయిన్ ఉంటే బాగుంటుందని తీసుకున్నట్లుగా నిధి అగర్వాల్ క్యారెక్టర్ సాగుతుంది. లవ్ ట్రాక్ మొత్తం బలవంతంగా కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
శింబుకు కొత్తే కానీ...
ఈశ్వర్‌గా మాస్ క్యారెక్టర్‌లో శింబు కొత్తగా కనిపించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో శింబు తక్కువగా సినిమాలు చేయడంతో అతడి ఈ క్యారెక్టర్‌లో చూడటం ఆడియెన్స్‌కు ఫ్రెష్‌ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ దర్శకుడి రొటీన్ టేకింగ్, మేకింగ్ వల్ల శింబు కష్టం మొత్తం వృథాగా మారింది.
పెదరాయుడిగా సీనియర్ డైరెక్టర్ భాగ్యరాజా పర్వాలేదనిపించారు. శింబు, భాగ్యారాజా మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు పెద్ద రిలీఫ్‌గా నిలుస్తాయి. హీరోయిన్లు నిధి అగర్వాల్, నందితాశ్వేత పాత్రలకు అసలు ఇంపార్టెన్స్ లేదు.
Eeswarudu Movie Review -ఔట్‌డేటెడ్ ఈశ్వరుడు....
ఈశ్వరుడు ఔట్‌డేటెడ్ ఫ్యామిలీ ఓరియెంటెంట్ మూవీ. కథ, కథనాలు, నటన పరంగా కంప్లీట్‌గా పాత వాసనలతో సాగే ఈ సినిమా నేటి తరం ప్రేక్షకుల్ని మెప్పించడం అసాధ్యమే...