Chaari 111 Review: చారి 111 రివ్యూ - వెన్నెలకిషోర్ హీరోగా హిట్ కొట్టాడా? లేదా?
Chaari 111 Review: వెన్నెలకిషోర్ హీరోగా నటించిన చారి 111 మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. స్పై యాక్షన్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు.
Chaari 111 Review: టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెలకిషోర్ (Vennela kishore) చారి 111 మూవీతో చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. స్పై కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్, టీజర్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించిన చారి 111 మూవీ ఎలా ఉంది? హీరోగా వెన్నెలకిషోర్ ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం…
రుద్రనేత్ర ఏజెన్సీ
రా, ఎన్ఐఏ ఏజెన్సీలకు ధీటుగా చట్టాలకు లోబడకుండా స్వతంత్రంగా రుద్రనేత్ర అనే ఏజెన్సీని ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) స్థాపిస్తాడు. ఈ రుద్రనేత్రకు ఆర్మీ జాబ్‌కు రిజైన్ చేసిన ప్రసాద్‌రావు (మురళీశర్మ)హెడ్‌గా వ్యవహరిస్తుంటాడు. హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో బాంబ్‌బ్లాస్ట్ జరుగుతుంది. సూసైడ్ బాంబర్ కేసును ఏజెంట్ చారికి (వెన్నెలకిషోర్) అప్పగిస్తాడు ప్రసాద్‌రావు.
చారి ఇన్వేస్టిగేషన్‌లో శ్రీనివాస్ (బ్రహ్మాజీ) అనే వ్యక్తి అనుమానితుడిగా తేలుతాడు. శ్రీనివాస్ ఇంట్లో దొరికిన ఓ కెమికల్ క్యాప్సుల్ వేసుకున్న వారు సూసైడ్ బాంబర్‌గా మారుతున్నారని తెలుస్తుంది. కెమికల్ క్యాప్సుల్‌కు 30 ఏళ్ల క్రితం ప్రసాదరావుకు కశ్మీర్ లో పరిచయమైన మహికి ఉన్న సంబంధం ఏమిటి?
మహి కొడుకు రావణ్ ఈ క్యాప్సుల్స్ తయారు చేస్తున్నాడా? అతడిని చారితో పాటు మరో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వనాథన్) ఎలా పట్టుకున్నారు? సీరియస్ కేసును డీల్ చేసే క్రమంలో చారి సృష్టించిన హంగామా ఏమిటి? రావణ్‌ను పట్టుకునే ప్రమాదంలో చారి చనిపోయాడా? లేదా? అన్నదే(Chaari 111 Review) ఈ మూవీ కథ.
స్పై యాక్షన్ కామెడీ...
గూఢచారి సినిమాలు ట్విస్ట్‌లు, టర్న్‌లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సీరియస్‌గా సాగుతుంటాయి. స్పై మూవీని కామెడీతో మిక్స్ చేసి చెప్పడం కత్తిమీద సాములాంటిది. చారి 111 మూవీతో(Chaari 111 Review) వెన్నెల కిషోర్ ఆ ప్రయత్నం చేశారు.
కెమికల్, బయోలాజికల్ వెపన్స్ తో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించే కంటికి కనిపించని శత్రువును చారి అనే ఏజెంట్ ఎలా పట్టుకున్నాడన్నదే ఈ మూవీ కథ.ఈ సినిమాలో సీరియస్ ఆపరేషన్‌ను కూడా చారి కామెడీగా మార్చేశాడు అని వెన్నెలకిషోర్ గురించి మురళీశర్మ డైలాగ్ చెబుతాడు. అతడి డైలాగ్‌కు తగ్గట్టే సినిమా సాగుతుంది.
చారి 111 కోసం కెమికల్ వెపన్స్, ఇండియా, పాకిస్థాన్ మధ్య డీల్ అంటూ సీరియస్‌గా సాగే సబ్జెక్ట్‌ను ఎంచుకున్న డైరెక్టర్ వెన్నెలకిషోర్ మార్కు కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాడు.
కామెడీ, యాక్షన్ బ్యాలెన్స్...
చారి అనే ఏజెంట్‌గా వెన్నెలకిషోర్ పాత్రకు ఇచ్చిన ఇంట్రడక్షన్‌లు, కేసును డీల్ చేసే క్రమంలో కంగారు పడుతూ అతడు చేసే హడావిడి చాలా చోట్ల హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. ఓ వైపు కామెడీని పండిస్తూనే అంతర్లీనంగా సూసైడ్ బాంబర్స్ మిస్టరీ కథను(Chaari 111 Review) ట్విస్ట్‌లతో నడిపించాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో కామెడీ, సీరియస్‌నెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు.
మురళీశర్మ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఆ తర్వాత సైంటిస్ట్ కొడుకును పట్టుకోవడానికి వెన్నెలకిషోర్ వేసే ప్లాన్స్ సీరియస్‌గా సాగుతాయి. రావన్ తప్పించడానికి రుద్రనేత్ర టీమ్‌లో పనిచేసే అమ్మాయి ఎందుకు ప్రయత్నించిందనే మలుపు సర్ ప్రైజింగ్ ఉంది. క్లైమాక్స్‌లో చారి పాత్రకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చి ఎండ్ చేయడం బాగుంది.
ఎన్ఐఏ ఏజెన్సీలు, దేశభద్రత లాంటి సెన్సిటివ్ టాపిక్‌ను కామెడీగా చెప్పడం ఆకట్టుకోదు. కామెడీ సీన్స్ కొన్ని బోరింగ్‌గా సాగాయి.
వెన్నెలకిషోర్ వన్ మెన్ షో...
చారి అనే సీక్రెట్ ఏజెంట్‌గా తన కామెడీతో వెన్నెలకిషోర్ నవ్వించాడు. వెన్నెలకిషోర్ వన్‌మెన్ షోగా ఈ మూవీ నిలిచింది. హీరోలా చూపించకుండా కమెడియన్‌గానే దర్శకుడు ఆయన పాత్రను డిజైన్ చేసుకోవడం బాగుంది. సంయుక్త విశ్వనాథన్ ఓ యాక్షన్ అదరగొట్టింది. గ్లామర్‌తో ఆకట్టుకున్నది. రుద్రనేత్ర హెడ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌లో మురళీ శర్మ మెప్పించాడు. సత్య, తాగుబోతు రమేష్ కామెడీ వర్కవుట్ అయ్యింది.
ఫుల్ టైమ్‌పాస్...
చారి 111 రెండున్నర గంటలు టైమ్‌పాస్ చేసే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీ. కొత్త జోనర్‌తో పాటు వెన్నెలకిషోర్ కామెడీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5