Bigg Boss Telugu 8 Today Promo: బిగ్ బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవ.. ఇంట్రెస్టింగ్‌గా పట్టుకోనే ఉండండి టాస్క్.. ప్రోమో
Bigg Boss Telugu 8 Today Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదలైన తొలి రోజు హౌజ్ లో గొడవలు మొదలయ్యాయి. మరోవైపు పట్టుకోనే ఉండండి అంటూ కంటెస్టెంట్లకు తొలి టాస్క్ ఇచ్చారు. వీటిలో సోమవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా సాగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
Bigg Boss Telugu 8 Today Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 1) ఘనంగా లాంచ్ అయిన సంగతి తెలుసు కదా. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లో అడుగుపెట్టారు. ఇక మూడు నెలల పాటు ఈ రియాల్టీ షో అభిమానులకే పండగే. అయితే సోమవారం (సెప్టెంబర్ 2) తొలి రోజు హౌజ్ లో ఏం జరిగిందన్నది చెబుతూ స్టార్ మా ఓ ప్రోమో రిలీజ్ చేసింది.
బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో
బిగ్ బాస్ తెలుగు 8 తొలి రోజు ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చిన తనను అప్పుడే బయటకు పంపేయాలని ఓట్లేస్తున్నారంటూ ప్రోమో మొదట్లోనే నిఖిల్ కు చెప్పుకొని బాధపడుతుంటాడు నాగమణికంఠ.
తనకు ఇష్టం లేని టాప్ మాట్లాడుతూ వేధిస్తున్నట్లు చెప్పి వాపోతుంటాడు. ఒక నిమిషం 47 సెకన్ల నిడివి కలిగిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. తొలి రోజు హౌజ్ లో కంటెస్టెంట్లు ఎలా ఉన్నారో చూపిస్తూ ఆ ప్రోమో సాగింది.
శేఖర్ బాషా వర్సెస్ సోనియా ఆకుల
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ తొలి రోజే శేఖర్ బాషా, సోనియా ఆకుల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. కిచెన్ లోని ఆరెంజ్ పండ్లను తీసుకొని క్యాచ్ లు పట్టుకుంటూ శేఖర్ ఆటాడుతుండటంపై సోనీ సీరియస్ అవుతుంది. ఎవరైతే ఆడుతున్నారో వాళ్లెవ్వరూ ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది.
దీనికి శేఖర్ బాషా కూడా సీరియస్ గానే స్పందిస్తాడు. హౌజ్ లో ఉన్నవన్నీ అందరి ప్రాపర్టీ.. నీ ఒక్కదానివే కాదంటూ వాదనకు దిగుతాడు. ఎవరైతే మనుషుల్లాగా తిందామని అనుకుంటున్నారో వాళ్లదాంట్లో అవి పెట్టకండి అని సోనీ మరోసారి సీరియస్ గా చెబుతుంది.. అప్పుడు ఆ పండు తింటూ అంటే నేను మనిషిని కాదా అని శేఖర్ బాషా అంటాడు.
పట్టుకోనే ఉండండి టాస్క్
ఇక కొత్త సీజన్ తొలి రోజు కంటెస్టెంట్లకు తొలి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ పేరు పట్టుకోనే ఉండండి. ఆరుగురు పోటీదారులకు బిగ్ బాస్ ఇచ్చిన తొలి టాస్క్ ఇది. ఓ కేజ్ లో తాళ్లను కట్టి వాళ్లను దానిపై నిలబడాల్సిందిగా చెప్పారు. వాళ్లు ఆ తాళ్లను మాత్రమే పట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. కింద అడుగుపెట్టినా, కేజ్ ను పట్టుకున్నా ఔటైపోతారు.
ఆ తర్వాత ఓ వీల్ పై అన్ని తాళ్ల రంగులను ఉంచారు. తర్వాత వీల్ ను తిప్పగా ఏ రంగు వస్తే ఆ రంగు తాడును కట్ చేస్తారు. ఇలా ఒక్కో తాడును కట్ చేసుకుంటూ వెళ్తారు. అయినా కూడా కంటెస్టెంట్లు కింద అడుగు పెట్టకుండా తాళ్లనే పట్టుకొని తమను తాము నియంత్రించుకుంటూ ఉండాలి. ఇదీ టాస్క్. ఇందులో ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే సోమవారం (సెప్టెంబర్ 2) బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ చూడాల్సిందే.