Bigg Boss 6 Telugu Episode 44: ఫ్లర్ట్ చేయలేదని గీతూ బాధ.. నామినేషన్‌లో 13 మంది.. ఇనాయా-శ్రీహాన్ గొడవ తగ్గేలా లేదు..!
Bigg Boss 6 Telugu Episode 44: ఏడో వారం నామినేషన్‌లో రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనాయా, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ వారం మొత్తం 15 మంది హౌస్ మేట్స్‌లో 13 మంది ఉన్నారు.
Bigg Boss 6 Telugu Episode 44: బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్లు మొదలయ్యాయి. వారం మాత్రం చప్పగా సాగుతున్న బిగ్‌బాస్ షో రసవత్తరంగా మారేది సోమవారం ఎపిసోడ్‌తోనే. ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు, ఫైట్లు, గొడవలు ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. కానీ ఈ సారి నామినేషన్లలో పెద్దగా హడావిడి లేదు. ఇనాయ-శ్రీహాన్ మినహా మిగిలిన వారివి సేఫ్ రీజన్స్ లేదా గొడవ ఎందుకులే అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ అంత రసవత్తరంగా సాగలేదు.
గీతూను ఎవరూ ఫ్లర్ట్ చేయలేదట..
ఇంక ఎపిసోడ్ ప్రారంభంలోనే సునయా (సూర్య-ఇనాయా) మాటలతో ప్రారంభమైంది. ఇనాయా దృష్టి ఆట నుంచి మనుషులపై మళ్లిందని వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పడంతో సూర్య-ఇనాయా ఫేక్ వార్ సృష్టించుకుంటారు. కావాలనే గొడవలు పడినట్లు హౌస్ మేట్స్‌ను నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మరి ఇక్కడ హౌస్ మేట్స్‌ను నమ్మిస్తే.. ఆడియెన్స్ ఏమైనా పిచ్చోళ్లా? అనే చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు. మరోపక్క గీతూ .. ఆదిరెడ్డి బాలాదిత్యతో సాగిన సంభాషణ ఆసక్తిగా సాగింది. ఇండస్ట్రీలో తనకు ఒక్కరంటే ఒక్కరూ కూడా ప్రపోజ్, ఫ్లర్ట్ చేయలేదని గీతూ చెప్పింది. అందరూ గీతక్కా అని పిలుస్తుంటారని, బహుశా తను అందంగా లేనేమో అని బాధపడుతుంది. ఇందుకు.. నీకు ప్రపోజ్ చేస్తే వాడు మందంగా అయిపోతామేమోనని ప్రపోజ్ చేసుండరని రేవంత్ జోకు పేల్చాడు. ఆదిరెడ్డి కూడా రేవంత్‌కు తోడై కంపను తెచ్చుకుని నెత్తికి అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకుని ఉంటారని పంచ్ వేశాడు. అనంతరం బిగ్‌బాస్ అనౌన్స్ మెంట్‌తో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యులు తాము నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్ మేట్స్‌ను నామినేట్ చేయడానికి బురద నీళ్లు పడే కుర్చిలో కూర్చోపెట్టాల్సిందిగా ఆదేశిస్తాడు.
ముందుగా ఫైమా.. వాసంతి, బాలాదిత్యను నామినేట్ చేయగా.. అనంతరం రోహిత్.. రేవంత్, శ్రీహాన్‌ను నామినేట్ చేస్తాడు. శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను.. బాలాదిత్య.. రేవంత్, ఫైమాను నామినేట్ చేస్తాడు. ఆదిరెడ్డి.. అర్జున్, వాసంతిని ఇంటి నుంచి పంపేందుకు నామినేట్ చేస్తాడు. మెరీనా.. రేవంత్, ఆదిరెడ్డిని, గీతూ.. వాసంతి, బాలాదిత్, రాజ్.. బాలాదిత్య, వాసంతిని, ఇనాయా.. బాలాదిత్య, శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. అనంతరం అర్జున్.. బాలాదిత్య, ఆదిరెడ్డిని, వాసంతి.. రాజ్, రేవంత్‌ను నామినేట్ చేయగా.. కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను, రేవంత్.. మెరీనా, శ్రీసత్యను, సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్ చేశారు.
అర్జున్-ఆదిరెడ్డి వాదన..
ఈ ప్రక్రియలో అర్జున్-ఆదిరెడ్డి మధ్య చిన్నపాటి వాదన జరుగుతుంది. అర్జున్.. ఆదిరెడ్డిని నామినేట్ చేస్తూ.. మీరు లెస్ డిజర్వడ్, డిజర్వడ్ అని మరొకరు నామినేట్ చేయకూడదు, అలా చేయడం నాకు నచ్చడం లేదని ఆదిరెడ్డితో అంటాడు. అలా అనకూడదు అంటానికి మీరు ఎవరు? అది చేయకూడదు, ఇది చేయకూడదని మీరు అనకూడదని, నేను అర్హత లేదని ఎప్పుడూ చెప్పలేదని.. ఒకరితో పోలిస్తే ఇంకొకరు కాస్త తక్కువ అనర్హత కలిగి ఉంటారని చెప్పానని తెలిపాడు. మీరు ఒపినియన్ చెబితే బాగుంటదని కానీ.. స్టేట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశాడు. ఇది నా దృష్టిలో చాలా చెత్త రీజన్ అని బదులిచ్చాడు.
ఇనాయా-శ్రీహాన్ గొడవ..
ఇనాయా-శ్రీహాన్ గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. గత వారం తనను నామినేట్ చేయనప్పటికీ.. కావాలని మనస్సులో పెట్టుకుని తనను నామినేట్ చేసిన ఇనాయాపై ఈ వారం శ్రీహాన్ పగ తీర్చుకున్నాడు. తన బిహేవియర్ నచ్చలేదని, అలాగే డ్రామా క్వీన్ అంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఇందుకు ఇనాయా కూడా సీరియస్ అయింది. కావాలనే రీజనే లేకుండా తనను నామినేట్ చేస్తున్నావని స్పష్టం చేసింది. అలాగే శ్రీహాన్‌ను నామినేట్ చేస్తూ ఇనాయా.. నేనంటే నీకు భయమా.. అందుకే నాకు చెప్పకుండా కెప్టెన్ సూర్యకు చెప్పావా అంటూ ఫైర్ అయింది. నాకు ఎలాంటి భయమూ లేదని, అది నా కళ్లల్లో కూడా కనిపించదని స్పష్టం చేశాడు. తనకు పని ఇచ్చింది సూర్య కాబట్టి అతడితోనే చెప్పానని స్పష్టం చేశాడు. లవ్ ట్రాక్‌తో గాడి తప్పిన ఇనాయా.. శ్రీహాన్‌ను మళ్లీ టార్గెట్ చేసి గొడవ పడుతుందని తెలుస్తోంది. అయితే మునుపటి ఇనాయాపై సానుభూతి ఉన్న ఆడియెన్స్‌కు ఈ సారి ఉండకపోవచ్చని అర్థమవుతుంది. సూర్యతో లవ్ ట్రాక్, ఫేక్ గొడవలు ఇలాంటి చిరాకు తెప్పిస్తున్నాయి.
మరోపక్క శ్రీహాన్ తన మరో నామినేషన్‌లో కీర్తిని నామినేట్ చేశాడు. 23 ఏళ్లు స్ట్రాంగ్ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుందని, అంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అని చెప్పాడు. ఇందుకు కీర్తి కూడా బాగా హర్టయినట్లు తెలుస్తుంది. అనంతరం తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్‌పై వాసంతి సీరియస్ అయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్ అంటే నథింగ్ అని, హెయిర్ తన జీవితం అయినా దాన్ని కట్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ఇందుకు రాజ్ కూడా నామినేషన్స్‌కు, త్యాగం చేసిన హెయిర్‌ను తీసుకువస్తున్నావ్ అంటూ రాజ్‌పై ఫైర్ అయింది.
ఈ వారం ఎక్కువగా బాలాదిత్య, రేవంత్‌కు నామినేట్ చేశారు. చివర్లో రేవంత్ పుష్ప స్టైల్‌లో తగ్గేదేలే లేదంటూ భుజంపైకెత్తి మేనరిజాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా ఈ ఏడో వారం నామినేషన్‌లో రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనాయా, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ వారం గీతూ, సూర్య మినహా అందరూ నామినేషన్‌లోనే ఉన్నారు.
సంబంధిత కథనం