Veera Simha Reddy Tickets Rate Hike: వీరసింహారెడ్డి ట్రైలర్ డైలాగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో టికెట్ రేట్ల పెంపు కష్టమేనా?
Veera Simha Reddy Tickets Rate Hike:బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా వీరసింహారెడ్డి ట్రైలర్‌లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండటంతో ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Veera Simha Reddy Tickets Rate Hike: బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్నది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు పోటీగా చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బడ్జెట్‌తో పాటు పండుగను దృష్టిలో పెట్టుకొని వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమా టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఏపీతో పాటు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ శుక్రవారం రిలీజ్ చేసిన వీరసింహారెడ్డి ట్రైలర్‌లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు డైలాగ్స్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో...కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు అనే డైలాగ్ జగన్ ప్రభుత్వానికి కౌంటర్‌గా రాసినట్లు చెబుతోన్నారు.
ఇటీవలే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వీరసింహారెడ్డి ట్రైలర్ ద్వారా కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
పదవి చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు అనే డైలాగ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే ట్రైలర్‌లో పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ డైలాగ్స్ ఎఫెక్ట్ టికెట్ రేట్ల పెంపుపై ప్రభావాన్ని చూపించబోతున్నట్లు చెబుతున్నారు.
వీరసింహారెడ్డి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లను పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
వీరసింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హనీరోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.