Rocky Aur Rani ki Prem Kahani OTT Release: రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh) రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో శుక్రవారం రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ బాలీవుడ్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) చూడాలంటే 349 రూపాయలు చెల్లించాల్సిందే.
ఈ బాలీవుడ్ మూవీలో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా అలియాభట్ (Alia Bhatt) హీరోయిన్‌గా నటించింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ సినిమాతో డైరెక్టర్‌గా కరణ్ జోహార్ రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 160 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలైంది.
స్టోరీ రొటీన్ అనే కామెంట్స్ వినిపించినా రణ్‌వీర్‌సింగ్, అలియాభట్ యాక్టింగ్ కారణంగా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 350 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ సినిమాలో సీనియర్ బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు.
రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ సినిమాలో పంజాబీ యువకుడు రాఖీగా రణ్‌వీర్‌సింగ్ కనిపించగా బెంగాళీ జర్నలిస్ట్ రాణిగా అలియాభట్ నటించింది. వారి ప్రేమకు ప్రాంతీయ భేదాలతో పాటు కుటుంబం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ అవాంతరాలు జయించి రాఖీ, రాణి ఎలా ఒక్కటయ్యారన్నదే ఈ మూవీ కథ.