Tollywood Year Review 2022: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని హీరోలు వీళ్లే
Tollywood 2022: 2022లో స్టార్ హీరోలు కొందరు వెండితెరపై కనిపించలేదు. సిల్వర్ స్క్రీన్‌కు గ్యాప్ ఇచ్చారు. ఆ హీరోలు ఎవరంటే...
Tollywood 2022: 2022 టాలీవుడ్‌కు చక్కటి ఫలితాల్ని అందించింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ ఏడాది భారీ విజయాలతో కొందరు స్టార్ హీరోలు మెరవగా మరికొందరు మాత్రం 2022లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. వారు నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఆ హీరోలు వీరే
అల్లు అర్జున్ (Allu Arjun)
2022 ఏడాదిలో తెలుగు తెరపై కనిపించలేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది డిసెంబర్‌లో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు అర్జున్. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యానికి యాక్షన్ అంశాలను జోడిస్తూ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 400 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.
అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర పాటు కష్టపడ్డ అల్లు అర్జున్ 2022 ఏడాది మొత్తం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించారు. ఇటీవలే పుష్ప సీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. వచ్చే ఏడాది చివరలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలకృష్ణ (Balakrishna)
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై అభిమానులకు కనిపించలేదు బాలకృష్ణ. గత ఏడాది అఖండ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న ఆయన ఈ ఇయర్ మొత్తం వీరసింహారెడ్డి షూటింగ్‌తో బిజీగా గడిపారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.వీరసింహారెడ్డితో పాటు ఇటీవలే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టారు బాలకృష్ణ. ఈ ఏడాది వెండితెరకు గ్యాప్ ఇచ్చిన ఆయన వచ్చే ఏడాది రెండు సినిమాలతో ఆ విరామాన్ని ఫుల్‌ఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాయిధరమ్‌తేజ్Sai Dharam Tej)
సాయిధరమ్‌తేజ్ బిగ్ స్క్రీన్‌పై కనిపించి ఏడాది దాటిపోయింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ తర్వాత సాయిధరమ్‌తేజ్ సినిమా ఏది రిలీజ్ కాలేదు. బైక్ యాక్సిడెంట్ కారణంగా చాలా రోజుల పాటు షూటింగ్‌లకు దూరమయ్యారు. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న అతడు విరూపాక్ష సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. విరూపాక్ష సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్ కథ,స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్
గత ఐదారేళ్లుగా ప్రతి ఏడాది తప్పకుండా ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఇయర్ మాత్రం గ్యాప్ తీసుకున్నాడు. అల్లుడు అదుర్స్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
అఖిల్ అక్కినేని కూడా 2022లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఈ ఇయర్ మాత్రం ఏజెంట్ సినిమా షూటింగ్‌కే కేటాయించారు అఖిల్. వచ్చే ఏడాది ఆరంభంలో ఈసినిమా రిలీజ్ కానుంది.