Congress Govt : భట్టికి "డిప్యూటీ" ఖరారైనట్లేనా..?-will bhatti vikramarka get deputy cm in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress Govt : భట్టికి "డిప్యూటీ" ఖరారైనట్లేనా..?

Congress Govt : భట్టికి "డిప్యూటీ" ఖరారైనట్లేనా..?

HT Telugu Desk HT Telugu
Dec 06, 2023 05:50 AM IST

Bhatti Vikramarka: కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పేరున్న భట్టికి డిప్యూటీ సీఎం పదవి దక్కటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన నేపథ్యంలో… భట్టి విషయంలో ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ మాజీ సీఎల్పీ నేత, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లు భట్టు విక్రమార్క కి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లేనా..? అన్న అంశం తాజాగా ఖమ్మం జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన మల్లు ఆనంతరాములు కుమారుడైన భట్టి విక్రమార్క తాజాగా జరిగిన ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రచార క్రమంలోనూ పలుసార్లు సీఎం తానే అన్నట్లు సంకేతాలు పంపారు. పలు ఇంటర్వ్యూస్ లో కూడా తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నిబద్ధతగా పని చేస్తానని తన మనోభావాన్ని వెల్లడించారు. అయితే తాజా రాజకీయ పరిణామల నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి పదవి చేజారిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో పలు దఫాలుగా జరిగిన చర్చల్లో ఆయనను సముదాయించే ప్రయత్నమే జరిగినట్లు స్పష్టమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ నేత్రత్వంలో కేసి వేణుగోపాల్ నివాసంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఉత్తమ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను బుజ్జగించే ప్రయత్నమే జరిగినట్లు తేలిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసిన క్రమంలో డిప్యూటీ సీఎంగా తనకు మాత్రమే అవకాశం కల్పించాలని భట్టి విక్రమార్క పట్టు పట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని అధిష్టానం భావించడం గమనార్హం. సీఎంగా అవకాశం ఇవ్వని పక్షంలో డిప్యూటీ సీఎం గా తనకు ఒక్కడికే అవకాశం ఇవ్వాలని భట్టి చివరి క్షణం వరకు పోరాడారు. కాగా సీఎంగా రేవంత్ ను ప్రకటించిన నేపథ్యంలో భట్టికి ఎలాంటి హామీ లభించి ఉంటుందనే అంశంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది.

భట్టి విక్రమార్క తండ్రి మల్లు అనంతరాములు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతగా కొనసాగారు. భట్టి సోదరుడు మల్లు రవి కూడా ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కి విధేయుడుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విక్రమార్క డిమాండ్ మేరకు డిప్యూటీ సీఎం ఖరారు చేసినట్లేనన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉండాలన్న భట్టి వాదనను అధిష్టానం స్వీకరించినట్లే అన్న చర్చ సర్వత్రా మొదలైంది. ఇదే వాస్తవమైతే ఆయన ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా గురువారమే పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. కాగా భట్టికి డిప్యూటీ సీఎం పదవి దక్కితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది మరో అరుదైన గౌరవంగా భావించాలి.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, హిందుస్థాన్ టైమ్స్, ఖమ్మం.

WhatsApp channel