Adilabad Updates: ఆదిలాబాద్‌లో ఓటర్లకు తాయిలాలు…ప్రలోభాలు
Adilabad Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో పూర్తి కానుండటంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్నాయి.
Adilabad Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. ఈనెల 28న సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం పూర్తి కానున్నడంతో అన్ని పార్టీల నేతలు ఓటర్లకు గాలాలు వేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ సంఘ భవనాలలో గెట్ టుగెదర్ పార్టీలు ఇస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లో పది నియోజకవర్గాలు ఉండగా ముఖ్యమైన నియోజకవర్గ కేంద్రాలైన నిర్మల్ లో, మంచిర్యాల, అదిలాబాద్, ఖానాపూర్, చెన్నూర్ తదితర కేంద్రాల్లో బలమైన నాయకులు ఉండడంతో పోటాపోటీగా ఓటర్లకు విందులు ఇస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కులాలవారీగా, సంఘాల వారీగా, యువజన సంఘాల వారీగా విందులు ఏర్పాటు చేసి ఓటు తమకే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కో నియోజక వర్గానికి మూడు పార్టీల నేతలు కోట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు ఓటర్లకు పండగ వాతావరణం ఏర్పడింది.
ఒక్కో సంఘానికి వరుసగా రెండు రోజులు రెండు పార్టీల నేతలు దావతులు ఇవ్వడంతో మద్యం, మాంసం ఏరులై పారుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 నియోజకవర్గాలు ఉండగా వివిధ పార్టీల నేతలు ఓటర్లకు వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
గతంలో పోలింగ్ కి ఒకటి రెండు రోజుల ముందు పార్టీలు ఏర్పాటు చేసేవారు, కానీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పటి నుండే నోట్ల పంపిణీ ప్రారంభమైనట్లు తెలుస్తుంది.
పక్కా ప్రణాళిక తోనే ఓటు కు నోటు ఇస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీల కార్యకర్తలు సూచన మేరకే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి వారి బంధువులతో కలిసి ఓటరు ఇంటికి వెళ్లి ఒక్కో నోటుకు 1000 నుంచి 2000 పంపిణీ చేస్తు ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నియోజకవర్గంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది, నియోజవర్గంలో ఎవరెవరికి ఓటు వచ్చిందో తెలుసుకుని వారింట్లో మకాం వేసి ఓటుకు నోటు ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
ప్రధాన పార్టీలు ఏ పార్టీ ఎన్ని డబ్బులు, మద్యం పంచుతుందో తెలుసుకుని అంతకుమించి పంచేందుకు ఇతరులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాదులోని ఒక నియోజకవర్గంలో ఇప్పటికే అధికారికంగా కుక్కర్ల ను సైతం పంపిణీ చేశారు. కొన్ని చోట్ల నాయకులు యువతకు క్రికెట్ కిట్లు, గోవా వెళ్లేందుకు బస్సులు బుక్ చేసి ఇస్తున్నారని చర్చ కొన సాగుతుంది.
(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్.)