Patancheru Politics : నీలం మధుకే నా మద్దతు ... మళ్లీ రూట్ మార్చిన కౌన్సిలర్
Telangana Assembly Elections 2023: పటాన్ చెరు రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో… స్థానిక ప్రజాప్రతినిధులపై నజర్ పెడుతున్నారు నేతలు. ఈ క్రమంలోనే అమీన్ పూర్ మున్సిపాలిటీ 19వ వార్డ్ కౌన్సిలర్ సదువు మల్లేష్.. మళ్లీ బీఎస్పీ గూటికి చేరారు.
Patancheru Assembly constituency : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొందరు రోజుకో పార్టీ మార్చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ 19 వ వార్డ్ కౌన్సిలర్ సదువు మల్లేష్ మంగళవారం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో బీఎస్పీ పార్టీ లో చేరారు. అదేరోజు రాత్రి మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. చివరికి మనసు మార్చుకొని మళ్ళీ బీఎస్పీ పార్టీ లో చేరారు. బీఆర్ఎస్,బీఎస్పీ పార్టీలలో చేరికలతో పటాన్చెరు లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమీన్ పూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ సదువు మల్లేష్ బుధవారం ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవం కోసం నేను ఇష్టపూర్వకంగానే నీలం మధు సమక్షంలో బీఎస్పీ పార్టీ లో చేరినట్లు తెలిపారు. మంగళవారం బీఎస్పీ పార్టీ లో చేరగా,ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశంతో బీఆర్అస్ నాయకులూ,కార్యకర్తలు మా ఇంటికి వచ్చి నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అన్నివర్గాల సంపూర్ణ న్యాయం బీఎస్పీ పార్టీ తో సాధ్యమవుతుందని భావించి ఈ పార్టీ లో చేరానని తెలిపారు.
పటాన్చెరులో తీవ్ర పోటీ ...
ఇక మీదట బీసీల ఆత్మ గౌరవ పోరాటానికి మద్దతుగా బీఎస్పీ పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కే మద్దతు ఇచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని మల్లేష్ తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, వేరే పార్టీ నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలోకి ఎలా మలుపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి పార్టీలో ఎక్కువ మంది ఉంటే ఆ పార్టీ బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. దానిలో భాగంగానే పార్టీ మారిన వాళ్ళని నాయనో,భయానో మళ్ళీ వెనక్కి తెచ్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. అలా పార్టీ మారిన సర్పంచ్ లకు ,ఎంపీటీసీలకు,జడ్పీటీసీలకు,మున్సిపల్ కౌన్సిలర్ లకు ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అభ్యర్థులు ఎవరికి ఎం కావాలో చూసి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శాసనసభ ఎన్నికలలో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అభ్యర్థులందరూ విజయమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నప్పటికీ పటాన్చెరు లో బీఆర్ఎస్, కాంగ్రెస్,భాజపా,బీఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.