Bandi Sanjay : మోటార్లకు మీటర్లు పెట్టాలనుకున్నది కేసీఆరే, మేం వార్నింగ్ ఇస్తే వెనక్కి తగ్గారు- బండి సంజయ్
Bandi Sanjay : దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్ ఎమ్మెల్యేలకు ముందుగా ముట్టచెబితేనే మంజూరు అవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఏటా 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కనీస మద్ధతు ధరను ఏకంగా రూ.3100 చెల్లిస్తామని ప్రకటించారు. మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ తో కలిసి బెజ్జంకిలో నిర్వహించిన రోడ్ షోకు భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ...మీరు కేసీఆర్ కు ఓట్లేసి గెలిపిస్తే ఫామ్ హౌస్ లో తాగి పండుకోవడం తప్ప రాష్ట్రానికి మంచి చేసే పనులు ఏమి చేయలేదని మండిపడ్డారు. దేశమంతా ఇండ్ల మంజూరు చేస్తున్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లకు నిధులిస్తే వాటిని దారి మళ్లించిన కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా ప్రజలకు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు.
పేదలందరికీ 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్
దళిత బంధు, బీసీ బంధు పథకం ఎంతమందికి వచ్చిందో ఇక్కడ ఉన్న ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. దళిత బంధు పథకంలో ముప్పై శాతం కమీషన్ స్థానిక ఎమ్మెల్యేలకు ముందుగా ముట్టచెబితేనే మంజూరు అవుతున్నాయని స్వయాన కేసీఆర్ చెప్పారని, అలాంటి స్కీంలలో వాళ్లు తీసుకున్న డబ్బులో నుంచి కమీషన్లు కేసీఆర్ కు అందుతున్నాయన్నారు. కాబట్టే స్థానిక ఎమ్మెల్యే అయిన రసమయి బాలకిషన్ లాంటి వారికి తిరిగి సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. పేదలందరికీ రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోంది మోదీ ప్రభుత్వమేనన్నారు. మరో ఐదేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వబోతున్నామని, బీజేపీ అధికారంలోకి వస్తే వరికి కనీస మద్దతు క్వింటాలుకు రూ.3100 ఇస్తామన్నారు. ఆరేపల్లి మోహన్ పక్కా లోకల్ అని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తనన్నారు. మానకొండూరు నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఇద్దరు కూడా నాన్ లోకల్ అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ లేదు
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని మోటార్లకు మీటర్లు పెట్టాలనుకున్నది కేసీఆరేనని తాము వార్నింగ్ ఇస్తేనే వెనుకడుగు వేశారని బండి సంజయ్ అన్నారు. మళ్లీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారంటీలకు విలువ లేదని, ఢిల్లీలో, గల్లీలో అధికారం లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలకు గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే ఏటా 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకునేందుకు వరికి కనీస మద్దతు ధర రూ.3100లుగా చెల్లిస్తామన్నారు. ప్రజలకు మంచి చేసే బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
రిపోర్టర్ : గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా