Kukatpally Janasena: కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలన్న నాదెండ్ల, 26న అమిత్‌షాతో ప్రచారం
Kukatpally Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Kukatpally Janasena: కూకట్‌పల్లిలో జనసేన తరపున పోటీ చేస్తున్నప్రేమ్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ్ కుమార్ విజయానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలన్నారు.
కూకట్ పల్లి నియోజక వర్గం జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని, భారీ మెజార్టీతో తెలంగాణ శాసనసభకు పంపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శ్రీ మనోహర్ గారు జనసేన ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం చేయాలని సూచించారు.
“కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న 407 పోలింగ్ బూత్ లకు బాధ్యుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని మనోహర్ తెలిపారు. 24వ తేదీన నియోజకవర్గ పరిధిలోని జనసేన, బీజేపీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారన్నారు.
నవంబర్ 26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ కూకట్ పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ సభను జన సైనికులు, వీర మహిళలతోపాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నేడు, రేపు తెలంగాణలో పవన్ ప్రచారం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. బిజెపీ పొత్తుతో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. ఉమ్మడి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయనున్నారు.
22, 23 తేదీల్లో పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారు.22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వరంగల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23వ తేదీ ఉదయం 11గంటలకు కొత్తగూడెం, 2 గంటలకు సూర్యాపేట, మూడింటికి దుబ్బాకలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.