Revanth Reddy : పక్కా వ్యూహం.. అంతే దూకుడు, సూటి ప్రశ్నలు - కలగలిపితే 'రేవంతుడు'-interesting facts of revanth reddys political journey ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Revanth Reddy : పక్కా వ్యూహం.. అంతే దూకుడు, సూటి ప్రశ్నలు - కలగలిపితే 'రేవంతుడు'

Revanth Reddy : పక్కా వ్యూహం.. అంతే దూకుడు, సూటి ప్రశ్నలు - కలగలిపితే 'రేవంతుడు'

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 06, 2023 06:22 AM IST

Revanth Reddy News : తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సమస్యలనే సవాళ్లుగా తీసుకొని… ముందుకుసాగిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో అటుపోటులను ఎదురుచూశారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy : రేవంత్ రెడ్డి…. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా పీఠాన్ని ఎక్కబోతున్నారు. కాకలు తీరిన కాంగ్రెస్ లో తన మార్క్ ను చూపించిన రేవంత్ రెడ్డి… అధినాయకత్వాన్ని కూడా మెప్పించారు. 2017లో పార్టీలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి…. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో అగ్రభాగన నిలిచి… మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. అయితే పార్టీలో చేరిన ఆరేళ్లలోనే ఈ ఘనత(సీఎంగా అవకాశం) సాధించడం విశేషంగా మారింది.

పక్కా వ్యూహం.. అంతే దూకుడు

రేవంత్ అంటేనే ఓ వ్యూహంతో పని చేస్తారన్నట్లు ఉంటుంది. మెరుపుల్లాంటి మాటలు… సూటిగా నేరుగా… కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు ఆయనలో కనిపించే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు ప్రదర్శిస్తారు. ఏ మాత్రం వెనక్కి తగ్గటం తెలియదు. అడుగు వేశాడంటే… ముందుకే వెళ్తారు రేవంత్ రెడ్డి. ఆధారాలు, సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్… తన ఎక్కడా ఉన్నా కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తారనే చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో…. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి… టీటీడీ తరపున బలమైన వాయిస్ గా మారారు. ప్రత్యర్థులు కూడా సమాధానం ఇవ్వలేని విధంగా… తన ప్రశ్నాస్త్రాలను సంధించేవారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో…. టీడీపీని వీడారు రేవంత్. అనంతరం కాంగ్రెస్ లో చేరిన ఆయన…. వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే రాలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి…. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి కొడంగల్ లో ఓడిపోయారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి. కానీ ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు రేవంత్ రెడ్డి. ఈ విజయం ఆయనకు సరికొత్త ఆక్సిజన్ గా మారిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత…. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను స్వీకరించారు. అన్నీ తానై ముందుండి నడిపించారు. నేతల మధ్య అంతర్గత సమస్యలు ఉన్నా…. వెనక్కి తగ్గలేదు. హైకమాండ్ తో నిత్యం టచ్ లో ఉంటూ… పార్టీని గాడిలో పడేశారు. కీలకమైన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ఏ నేత ప్రచారం చేయని విధంగా… రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేసి…. కాంగ్రెస్ విజయంలో కీలంగా వ్యవహరించారు.

ఏబీవీపీతో ప్రస్థానం…

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. ఆ తర్వాత అంటే.. 2004లో కొంతకాలం టీఆర్ఎస్ లో పనిచేశారు. 2007లో మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జెడ్పీటీసీగా గెలిచారు.ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు. 2009లో కొడంగల్‌ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుని కాంగ్రెస్ సీనియర్ నేత గుర్నాథ్‌రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు.

-1969 నవంబరు 8న రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు.

-2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం

-2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక

-2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు

-2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్

-2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్

-2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా

-2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

-2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

-2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి

-2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం

-2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్

-2023 డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

WhatsApp channel