BJP Warangal : ఓట్లు పెరిగినా… సీట్లు దక్కలే
Telangana Assembly Elections 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి నిరాశ తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ కూడా గెలవలేదు. అయితే ఓట్ల శాతం మాత్రం బాగా పెరిగింది.
Telangana Assembly Elections 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బీజేపీ గతంతో పోలిస్తే చాలావరకు పుంజుకుంది. ఇదివరకు ఐదారు వేల మార్క్ దాటని కమలం పార్టీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా 30 వేలకు పైగా ఓట్లు సంపాదించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరిగిన చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓట్లు చీల్చడంతో పాటు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ దెబ్బకొట్టడంలో బీజేపీ కీలకంగా నిలిచింది. ఇదిలాఉంటే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓట్లు పెరిగిన సంతృప్తి ఉన్నా.. ఒక్క సీటు కూడా దక్కకలేదనే నిరాశ కనిపిస్తోంది.
తూర్పులో జస్ట్ మిస్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి వరంగల్ తూర్పు నియోజకవర్గంపై చర్చ ఎక్కువగా జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్రావు పోటీ చేశారు. మిగతా రెండు పార్టీల తీరు ఎలా ఉన్నా.. ఇక్కడ బీజేపీ పాగా వేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపిన పరిస్థితులు కూడా లేవు. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి రావు పద్మారెడ్డి పోటీ చేయగా.. పోలైన ఓట్లలో ఆమె 11,639 ఓట్లు మాత్రమే సాధించారు. పది వేల మార్క్ దాటిందనే పేరు తప్ప.. ఆ ఓట్లు పెద్దగా ఎఫెక్ట్ చూపని పరిస్థితి నెలకొంది. ఆ తరువాత 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి కుసుమ సతీశ్ పోటీ చేశారు. ఆయనకు 4,729 ఓట్లు మాత్రమే రాగా.. అప్పట్లో బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోయి మూడో స్థానంలో నిలిచింది. కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ఎఫెక్ట్ చూపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం వెనక్కి నెట్టి, కొండా సురేఖకు గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేయగా.. ఆయనకు 52,105 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 67,757 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ చివరి వరకు హోరాహోరీ పోరు జరగగా.. ఒక దశలో ప్రదీప్ రావుదే విజయమనే ప్రచారం జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని 42,783 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాగా ఇక్కడ బీజేపీ ఏం మాత్రం పట్టుతప్పినా.. బీఆర్ఎస్ పుంజుకున్నా.. ఫలితం మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .
దాస్యంకు తప్పని ఓటమి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇక్కడ 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, టీడీపీ కూటమి నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు 5,979 ఓట్లకే పరిమితం అయ్యారు. ఆ తరువాత బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మొన్నటి వరకు బీజేపీలో కొనసాగిన రాకేశ్ రెడ్డి పార్టీ గ్రాఫ్ పెరగడంలో ఎంతగానో కృషి చేశారు. రాకేశ్ రెడ్డి పార్టీ మారినా రావు పద్మారెడ్డి కార్యకర్తలు, నేతలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించారు. దీంతో ఈసారి బీజేపీ నుంచి పోటీకి దిగిన రావు పద్మారెడ్డికి 30,826 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు 57,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి 72,649 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఓట్లు బాగా పెరగడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలాయి. దీంతో ఉద్యమకారుడిగా, ఓటమి ఎరుగని నేతగా పేరున్న దాస్యం వినయ్ భాస్కర్ కు కూడా గెలుపు చేజారింది. ఒకవేళ బీజేపీకి ఓట్లు పెరగకపోతే అవి కూడా బీఆర్ఎస్ కు కలిసొచ్చి ఫలితాన్ని మార్చే అవకాశం ఉండేది.
ఇదివరకు 2 వేలు.. ఇప్పుడు 38 వేలు
2018 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో బీజేపీ నామమాత్రపు ప్రభావం కూడా చూపలేదు. ఆ సమయంలో బీజేపీ నుంచి డా.పెసరు విజయచందర్ రెడ్డి పోటీ చేయగా.. ఆయనకు 2,483 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈసారి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు బీజేపీ నుంచి గార్డియన్ హాస్పిటల్ చైర్మన్, డాక్టర్ కాళీప్రసాద్ రావు పోటీలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ కు 72,573, బీఆర్ఎస్ కు 64,632 ఓట్లు రాగా.. బీజేపీకి అనూహ్యంగా 38,735 ఓట్లు వచ్చాయి. గతంలో మూడు వేలు కూడా దాటని పార్టీకి ఇప్పుడు 38 వేలకుపైగా ఓట్లు రావడంతో ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై పడింది. హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన చల్లా ధర్మారెడ్డి కాస్త విజయానికి దూరం కావాల్సి వచ్చింది. కాగా బీజేపీ మూడోస్థానానికి పరిమితం అయినా.. గతంతో పోలిస్తే అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం.
ఒక్కసీటు కూడా దక్కలే
గతంలో పోలిస్తే బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగినా.. ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో 10 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక రెండు స్థానాలను బీఆర్ఎస్ సొంత చేసుకుంది. బీజేపీ అన్ని స్థానాల్లో మూడో స్థానానికి పరిమితం అయినా.. రాబోయే ఎన్నికల వరకు మరింత ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటివరకు బీజేపీ పట్టువిడువకుండా కొట్లాడుతుందో.. నిరాశకు గురై చతికిలపడుతుందో చూడాలి.
రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు , వరంగల్ ప్రతినిధి