AP Election Results 2024 : ఏపీలో 2014 ఎన్నికల సీన్ రిపీట్ - మళ్లీ వికసించిన 'కూటమి'
Andhra Pradesh assembly election Results 2024 : ఏపీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి సక్సెస్ కొట్టేసింది. 2014లో అధికారంలోకి రాగా….ఈసారి జరిగిన ఎన్నికల్లో(2024) కూడా విజయం సాధించటం ఖాయంగా మారింది.
Andhra Pradesh Assembly Election Results 2024 : ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్ కొట్టేసింది. భారీ విజయం సాధించటం ఖాయంగా మారింది. తెలుగుదేశం పార్టీనే 110 స్థానాల్లో పాగా వేయగా… కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన కూడా సత్తా చాటే దిశగా అడుగులు వేశాయి.
2014లోనూ పొత్తు విజయం….
రాష్ట్ర విభజన తర్వాత… తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేాశాయి. వీరి కూటమికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. కానీ ఎక్కడా పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించింది. నవ్యాంధ్రలో అధికారంలోకి రావటంతో….చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ…102 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో విక్టరీ కొట్టింది. మొత్తం 106 స్థానాల్లో గెలిచి…. కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.
ఇక కూటమిలో భాగంగా కేంద్రంలోని ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగమైంది. మూడేళ్లపాటు అంతా భాగానే నడిచినప్పటికీ… ఆ తర్వాత క్రమంగా తెలుగుదేశం, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. విభజన హామీల విషయంలోనే ఈ సమస్య తలెత్తింది. ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో బీజేపీ విఫలమైందన్న కారణంతో టీడీపీ వీధి పోరాటానికి కూడా దిగింది. ఏకంగా ఢిల్లీ వేదికగా ధర్నాలు, దీక్షలను కూడా చేపట్టింది. ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పిన తెలుగుదేశం ఆ తర్వాత…. జరిగిన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితమైన సంగతి తెలిసిసిందే.
కుదిరిన పొత్తు - మళ్లీ సక్సెస్….
గత కొంతకాలంగా ఏపీలో వరుసగా పరిణామాలు మారుతూ వచ్చాయి. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ… ఎన్డీయే కూటమిలో చేరింది. ఈ విషయంలో పవన్ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. మూడు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. సీట్ల కేటాయింపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లాయి. కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ… వాటిని చేధించుకుంటూ ముందుకెళ్లారు.
ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు , ర్యాలీలు చేస్తూ దూకుడు పెంచారు. వీరికితోడు… ప్రధాని మోదీ, అమిత్ షా కూడా పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏపీలో కూటమికి అధికారం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేయటంతో పాటు… ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంలో టీడీపీ, జనసేన పార్టీలు విజయవంతమయ్యాయని చెప్పొచ్చు.
తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉంది. కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా పోటీ చేసిన ప్రతిచోట ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. ఓ రకంగా చూస్తే వైసీపీ 30 లోపే స్థానాలు దక్కే అవకాశం ఉంది. మిగతా అన్నిచోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలిచేలా ఉంది.
2014లో కూటమితో విజయం సాధించిన చంద్రబాబు… ఈ ఎన్నికల్లోనూ మరోసారి సక్సెస్ కొట్టేశారు. దీంతో మరోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిష్టించనున్నారు. ఏపీలో ఏర్పడి కొత్త ప్రభుత్వం పవన్ కీలకంగా మారే అవకాశం సుస్పష్టంగా ఉంది.