Akbaruddin Owaisi : మమ్మల్ని జైలుకు పంపి స్లో పాయిజన్ చేసి చంపాలని చూస్తున్నారు- అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Akbaruddin Owaisi : హైదరాబాద్ లో ఎంఐఎం ఓడించడం సాధ్యం కాక కొందరు కుట్రలు చేస్తున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపిచారు. తమను జైలుకు పంపి స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akbaruddin Owaisi : లోక్ సభ ఎన్నికల వేళ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాతబస్తీ(Old City)లోని ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ......మా సోదరులను అక్రమంగా జైలుకు పంపించి అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము హైదరాబాద్ లో చాలా బలంగా ఉన్నామని, తమను ఓడించడం సాధ్యం గాక కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు సిద్ధం అవుతున్నటు తనకు అనుమానం వస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ లో గెలుపు ఎంఐఎందేనని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుస్తున్నారు : అక్బరుద్దీన్ ఒవైసీ
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న ఎంఐఎం (AIMIM)పార్టీకి అధికార పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వారితో మజ్లిస్ పార్టీ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది. అలాగే ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఎంఐఎంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది. అయితే లోక్ సభ ఎన్నికల(General Elections 2024) నేపథ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటేనని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఆరోపణ పై స్పందించిన అక్బరుద్దీన్.....కొందరు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ బీ టీం అని ప్రచారం చేస్తున్నారని, అయితే తమను కాంగ్రెస్ నేతలే ఎక్కువ కలుస్తున్నారని ఆయన అన్నారు.
అధికారంలో ఎవరున్నా వారికి మా సహకారం ఉంటుంది
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.....ఆ పార్టీతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్ అన్నారు.హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. ఎంత మంది రావులు, రెడ్లు కలిసినా.....తమ విజయాన్ని ఆపలేరు అన్నారు. జైలుకు పంపి స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాం అనగానే తాము బెదిరిపోయే రకం కాదన్నారు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశామన్నారు. ఎన్నికల్లో నేరుగా తమను ఎదురుకొని విజయం సాధించే సత్తా లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. మరోసారి హైదరాబాద్ గడ్డపై మజ్లిస్ జెండా ఎగరు వేస్తామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసీ
ఇదిలా ఉండగా.....తమకు కాంగ్రెస్ పార్టీ(Congress)తో ఎలాంటి పొత్తు, సహకారం లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (AIMIM Asaduddin Owaisi)స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections)తాము ఒంటరిగానే బరిలో దిగుతున్నామని తేల్చి చెప్పారు. రెండు రోజుల క్రితం బహదూర్ పుర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఫలక్ నామ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించిన అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ పార్టీ పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఖండించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పీడీఎం కూటమిలో మజ్లిస్ భాగస్వామి అని, తమిళ నాడులో ఏఐడీఏంకేతో మజ్లిస్ పార్టీకి పొత్తు ఉందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్(Hyderabad) పార్లమెంట్ పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించిన బీజేపీ నేతలను అసదుద్దీన్ తప్పుబట్టారు. నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు, మైనారిటీ ముస్లింలు, బీసీలు ఉన్నారని వారి మద్దతుతోనే తాము ప్రతిసారి విజయం సాధిస్తున్నామని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన సీఎఎ చట్టాన్ని(CAA)మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మండిపడ్డారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం