Parkal Assembly Constituency Eelections 2023 : సాగు చేసి పంట పండించే అన్నదాతలు ఎన్నికల బరిలో నిలిచారు. నాగలి వదిలి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు శుక్రవారం చివరి రోజు కాగా.. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటులో పరకాల నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపేందుకు నామినేషన్ వేశారు. దాదాపు 100 మంది రైతులు నామినేషన్ వేస్తామని వారం కిందటే ప్రకటించగా.. అందుబాటులో ఉన్న 8 మంది రైతులు నామపత్రాలు దాఖలు చేశారు. కాగా నియోజకవర్గంలో రైతులు గ్రీన్ ఫీల్డ్ హై వే ను రద్దు చేసి, తమ భూములు తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు బాధిత రైతులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి అసహనం వ్యక్తం చేశారు.
నాగపూర్–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 163 జీ)లో భాగంగా మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వరకు రహదారి నిర్మించనున్నారు. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.34 కిలోమీటర్ల మేర మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,441 కోట్ల అంచనా వ్యయం కాగా.. దాదాపు నాలుగు నెలల కిందట హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఉమ్మడి వరంగల్ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలు, హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేట, దామెర, ఆత్మకూరు మండలాలు, వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం, నెక్కొండ మండలాలు, మహబూబాబాద్ జిల్లా కురవి, సిరోలు, డోర్నకల్ మీదుగా విజయవాడ వరకు నిర్మించనున్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే లో భాగంగా పరకాల నియోజకవర్గంలో భూములు కోల్పోతున్నవాళ్లంతా భూసేకరణ ప్రక్రియను రద్దు చేయాలని ఆఫీసర్లు, లీడర్లకు చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చారు. రహదారి నిర్మాణం కోసం దాదాపు 590 హెక్టార్ల భూమి సేకరించనుండగా.. ప్రస్తుతం మార్కెట్ లో రూ.కోట్లలో ధర పలికే భూములకు రూ.లక్ష ల్లో పరిహారం కట్టిస్తామని చెప్పడంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, దీంతోనే పరకాలలో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు 8 మంది రైతులు బరిలో నిలిచారు.